రేవంతే బెటర్ ! ఆయనకే పీసీసీ పోస్ట్ ? 

చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్ష పదవి కి  కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రక్రియ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూనే ఉంది.

ఈ పదవికి పోటీ పడే నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో,  కాంగ్రెస్ అధిష్టానం సైతం ఈ పదవిని భర్తీ చేసే విషయంలో వెనకడుగు వేస్తూ వస్తోంది.

అలాగే ఏదో ఒక సందర్భం అడ్డు వస్తూ,  ఈ పదవి భర్తీ కాకుండా వాయిదా పడుతూ వస్తోంది.

ఇదిలా ఉంటే ఈ పదవికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి అని అధిష్టానం ఫిక్స్ అయిపోయింది.

అయితే పార్టీ సీనియర్ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండడం, రేవంత్ కు ఆ పదవి ఇస్తే , తామంతా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతాం అంటూ హెచ్చరికలు పంపడం,  అలాగే ఆయనకు కాకుండా ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదు అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్లు వ్యాఖ్యానించడం,  ఇలా ఎన్నో అంశాలతో ఈ పదవిని భర్తీ చేసే సాహసం కాంగ్రెస్ పెద్దలు  చేయకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.

కాకపోతే ఈ నాన్చుడు ధోరణి కారణంగా పార్టీ తెలంగాణలో పూర్తిగా ఉనికి కోల్పోయే పరిస్థితి ఉందనే సంకేతాలు రావడంతో,  ఇప్పుడు ఈ పదవిని భర్తీ చేసే ఆలోచనలో అధిష్టానం ఉంది.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి.దీంతో కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగం సిద్ధం చేసింది.

జానారెడ్డి , జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు , జీవన్ రెడ్డి ఇలా చాలామంది ఈ పదవికి పోటీ పడుతున్నారు.

కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.ఆయన అయితేనే పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళ గలరని,  బలమైన అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఢీకొట్టి కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు రాగలరని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు నమ్ముతున్నారట.

"""/"/ అలాగే రాహుల్ గాంధీ సైతం రేవంత్ విషయంలో సానుకూలంగా ఉన్నారని,  పేరుకు పార్టీ సీనియర్లు చాలామంది తెలంగాణలో ఉన్న , వారి వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం లేదనే  అభిప్రాయం ఉండటంతోనే , రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

సాగర్ ఫలితాలు తేలగానే కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక ఫైనల్ కాబోతోందట.ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ల నుంచి అభ్యంతరాలు వచ్చిన పట్టించుకోకూడదు అని అధిష్ఠానం నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తు కేటాయింపుపై విచారణ