జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ జెండాను ఆదివారం ఆవిష్కరించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి పూల మాల వేసి నివాళులర్పించారు.

అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు.అనంతరం ఆయన మాట్లాడారు.

తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటేలా, ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితంలో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించు కుంటున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పాటు ప్రాముఖ్యతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెల్లో వివరిస్తూ ఉద్యమకారులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా దశాబ్దాల కల నెరవేరిందని గుర్తు చేశారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ పది వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు.జిల్లాలో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పనిచేసి విజయవంతముగా పూర్తి చేసిన ఉద్యోగులు, అధికారులు, పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తూ, ఇదే స్ఫూర్తినీ భవిష్యత్ లో కొనసాగిస్తూ మన రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో, అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని కోరుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రజలను చైతన్యపరచడంలో తమవంతు సహకారం అందిస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల కు మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జడ్పీ సీఈవో ఉమా రాణి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్, ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటా పాటలతో అలరించారు.

వీడియో: సమ్మర్ హాలిడేస్ హోంవర్క్ చూసి ఆగ్రహించిన స్టూడెంట్ తల్లి..??