భిన్న భావజాలాల సంఘర్షణల వేదిక తరగతి గది..జూలూరు గౌరీశంకర్

సూర్యాపేట జిల్లా:తరగతి గదిలోనే ప్రపంచం రూపకల్పన జరుగుతుందన్న కోఠారి చెప్పిన తాత్విక ఆలోచనలకు మంగళం పాడి,రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తేవటం విద్యారంగానికి ప్రమాద హెచ్చరిక అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.

భిన్న భావజాలాల జ్ఞాన సంఘర్షణల వేదికగా నిలవాల్సిన తరగతి గది స్వేచ్ఛను హరించటం లౌకిక ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు.

సూర్యపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలలో భాగంగా "విజ్ఞానోత్సవ్" పేర నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ను జూలూరు గౌరీశంకర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వాసాలను, నమ్మకాలను వ్యక్తిగతం చేసుకొని సైన్సును సామాజికం చేస్తున్న దేశాలే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు.

చైనా,అమెరికా, జపాన్,సింగపూర్, థాయిలాండ్ లాంటి దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోవటానికి కారణం సైన్సును సామాజికం చేసుకుని ముందుకు సాగటమేనని తెలిపారు.

పాఠశాల స్థాయిలో పిల్లల్లో వికసించే సైన్సుకు సంబంధించిన జ్ఞానమే భవిష్యత్తులో సైన్స్ పరిశోధనలకు పునాది అవుతుందన్నారు.

పిల్లల్లో సైన్సుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయులు కృషి చేయవలసి ఉందని పేర్కొన్నారు.

రాబోయే కాలాన్ని ప్రభావితం చేయటానికి ఈతరం శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని అలవర్చుకుని శాస్త్రవేత్తలుగా ఎదగటానికి సైన్స్ ఫెయిర్ లు దోహదం చేస్తాయన్నారు.

అనంతరం భారత జన విజ్ఞాన వేదిక పూర్వ అధ్యక్షులు,సామాజిక విశ్లేషకులు అందె సత్యం మాట్లాడుతూ చైనా అభివృద్ధిలో దూసుకుపోవటానికి భారత్ వెనుక పడటానికి కారణం చైనా సైన్సులో ముందుకు పోవటమేనన్నారు.

అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి అంతరిక్షంలో క్షిపణులు ప్రయోగించి గెలవడానికి కారణం చిన్నప్పుడు సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్నప్పుడు కలిగిన ఆలోచనలే పునాదులని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు సీతారామరాజు అధ్యక్షత వహించగా సూర్యాపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శారద,కేఆర్ఆర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ అర్వపల్లి శంకర్,సర్పంచ్ చింతకాయల ఉపేందర్, సీనియర్ జర్నలిస్టు గంధం బంగారు,సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ అవార్డు గ్రహీత ఎండి జాఫర్, విద్యా కమిటీ చైర్మన్ సైదులు,రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఓరుగంటి రవి తదితరులు పాల్గొన్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?