పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.మొత్తంగా నాలుగు దశలు ముగిశాయి.
ఈ నాలుగు దశల్లో కలిపి 80.82 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక, మెజారిటీ పంచాయతీలను వైసీపీ దక్కించుకుంది.మొత్తంగా చూస్తే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వెనుకబడింది.
అయితే కొంతలో కొంత మెరుగ్గా చంద్రబాబు పుట్టిన ప్రాంతం లో పంచాయతీని టీడీపీ నిలబెట్టుకుంది.
కానీ, ఆశించిన విధంగా మాత్రం టీడీపీ దూకుడు చూపించలేక పోయింది.ఇది పైకి కనిపించే వాస్తవం.
అయితే దీనివెనుక మరో నిజం ఇప్పుడు చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతోంది.ప్రస్తుతం టీడీపీ తన ఖాతాలో వేసుకున్న పంచాయతీల్లో కూడా ఆశించిన ఓటింగ్ శాతం రాలేదు.
గెలుపు దక్కినా ఓటింగ్ శాతం మాత్రం భారీగా తగ్గుముఖం పట్టింది.గెలిచిన చోట కూడా కేవలం పదులు, ఇరవైల ఓట్ల తేడాతోనే టీడీపీ మద్దతు దారులు గెలుపు గుర్రం ఎక్కారు.
ఈ పరిణామం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.గత 2019 ఎన్నికల సమయంలో భారీగా తగ్గు ముఖం పట్టిన ఓటింగ్ పర్సంటేజ్ పుంజుకుంటుందని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ పుంజుకోకపోవడంతో పార్టీ సీనియర్లు డీలా పడుతున్నారు.
అయితే దీనిని ఎలా సాధించాలనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఎక్కడికక్కడ పార్టీలో గ్రూపులు, అసంతృప్తులు పెరిగిపోవడం పార్టీ పదవులు ఇచ్చినా నాయకుల్లో చలనం లేక పోవడం వంటివి టీడీపీకి శాపాలుగా పరిణమించాయని అంటున్నారు.
మరి ఈ పరిణామాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలని అంటున్నారు పరిశీలకులు.