దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో పోరాటాలు ఉధృతం చేయాలి

సూర్యాపేట జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో నేడు ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్న నయా నవాబులకు,నయా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.

జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్ లో సోమవారం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి సభకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ వెట్టి చాకిరి, దోపిడీ,పీడన నుండి ప్రజలను విముక్తి చేయడం కోసం,దొరలకు,భూస్వాములకు,వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య చేసిన పోరాటం అందరికీ ఆదర్శనీయమన్నారు.

కొమరయ్య పోరాట స్ఫూర్తితోనే వెట్టిచాకిరి రద్దయి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్యతో పాటు అమరులైన 4500 మంది అమరుల త్యాగాలు వృధా కావని పేర్కొన్నారు.

కొమరయ్య మరణించి 76 సంవత్సరాలు అవుతున్నా నేడు వారు ఆశించిన పీడన,దోపిడీ లేని తెలంగాణ రాలేదన్నారు.

దేశంలో నేడు నయా నవాబులు,నయా పెట్టుబడిదారులు పాలన కొనసాగిస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారత మాతాకీ జై అని మాట్లాడుతూ భారత మాతను అంగట్లో పెట్టి అమ్మేస్తూ దేశ సంపదను విదేశీ కార్పొరేట్ శక్తులకు,పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

భారత మాతను విదేశీ శక్తులకు కుదువబెట్టే పని బిజెపి వాళ్ళు చేస్తున్నారని విమర్శించారు.

దేశాన్ని సర్వనాశనం చేస్తూ దేశ సంపదను కొల్లగొడుతున్న బిజెపికి భారతమాత అంటూ మాట్లాడే నైతిక అర్హత కూడా లేదన్నారు.

భారత మాత పేరుతో దేశంలో ఉన్న ప్రజల మధ్య ఐక్యత లేకుండా మతాల పేరుతో, కులాల పేరుతో చీలికలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో మహిళలకు,రైతులకు,కార్మికులకు, పేదలకు అన్యాయం చేస్తూ బీజేపీ పాలన చేస్తుందన్నారు.దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తూ,ప్రజలపై భారాలు మోపుతూ దేశభక్తి గురించి మాట్లాడే అర్హత మోడీకి లేదన్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కు రాకుండా పాలన కొనసాగించడం దుర్మార్గమన్నారు.కేసీఆర్ ఒక నయా నవాబులాగా వ్యవహరిస్తూ పరిపాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వీరుల స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా వ్యవరిస్తున్న కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలని,అప్పుడే అమరవీరులకు జోహార్లు అర్పించిన వారమౌతామని అన్నారు.

ఈ సభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,కోట గోపి,చినపంగి నరసయ్య, వీరబోయిన రవి,నాయకులు అబ్బగాని భిక్షం, పందిరి సత్యనారాయణరెడ్డి,మామిడి సుందరయ్య, యాతాకుల వెంకన్న,యాతకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: పనసకాయల దొంగతనానికి వెళ్లాడు.. పాము చేతిలో అడ్డంగా బుక్ అయ్యాడుగా!