సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన నివారణ చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాబోయే వానాకాలం లో మన జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సన్నద్దం ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాబోయే వర్షాకాలం సీజన్ సీజనల్ వ్యాధులు నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్ పి గౌతమితో కలిసి జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ రాబోయే వానాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సన్నద్ధం కావాలని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులో మీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలని , అక్కడ నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

జూన్ 7 నాటికి ప్రతి గ్రామం వారిగా, ప్రతి మున్సిపల్ వార్డు వారిగా నీరు నిలువ ఉండే ప్రాంతాల వివరాలు సమర్పించాలని, ప్రతి మంగళ/ శుక్ర వారాలలో డ్రైడే కార్యక్రమంలో వాటర్ లాగిన్ పాయింట్ల మరమ్మత్తుకు గ్రామీణ ఉపాధి హామీ నిధులు వినియోగించుకొని పనులు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా ప్రతి వారం నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించాలని, నీరు అధికంగా నిలువ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా స్ప్రే చేయాలని, ఆయిల్ బాల్స్ వేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

పట్టణాల్లో ఉన్న మేజర్ డ్రైయిన్లను డీసెల్టింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో , పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలచే అవసరమైన మేర ఆయిల్ బాల్ తయారుచేసి సన్నద్ధం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ద వహించాలని అక్కడ అధికంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

ఆకస్మికంగా కురిసే భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మానేరు , మూల వాగుల ప్రవాహాలు అంతరాయం కలగకుండా సజావుగా సాగేలా చూడాలని అన్నారు.

జిల్లాలో ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డెంగ్యూ రాపిడ్ టెస్ట్ లు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లావ్యాప్తంగా కూలిపోయే స్థితిలో ఉన్న పాడైపోయిన భవనాలు, పాతబడిన భవనాలను తొలగించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమం కింద నిల్వ ఉన్న నీరు తొలగించాలని, ఇంటిలో నీరు నిల్వ ఉంచుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.

గ్రామాల్లో పట్టణాల్లో రెగ్యులర్ ఫాగింగ్ నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.నాలాల పై ఉన్న అక్రమ నిర్మాణాలను ,కట్టడాలను తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో ఉమారాణి,మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అవినాష్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.

మతిమరుపే అతన్ని కోటీశ్వరుడిని చేసింది.. అదెలాగో తెలిస్తే..