ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా పబ్లిక్ పరీక్షల నిర్వహణ: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రశాంత వాతావరణం లో కట్టుదిట్టంగా పబ్లిక్ పరీక్షల నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.

హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , డీజిపి రవి గుప్తా, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి ఇంటర్, 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయని, మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని దీనికోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు.

ఇంటర్, 10వ తరగతి పరీక్ష కేంద్రాల లోపలికి ఎవరు సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడానికి వీలులేదని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టంగా సజావుగా పరీక్షలు నిర్వహించాలని సీఎస్ తెలిపారు.

నిబంధనలను ఉల్లంఘించి లీకేజీలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విధుల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదవుతాయని అన్నారు.

పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునే విధంగా అవసరమైన రూట్లలో బస్సు సర్వీసులు నడపాలని, కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా సజావుగా పరీక్ష నిర్వహించాలని సీఎస్ సూచించారు.

ప్రభుత్వం మరో 2 గ్యారెంటీ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాలను అమలు చేస్తుందని, ఇందుకోసం లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు జారీ చేసిందని సీఎస్ అన్నారు.

ప్రతి ఒక్క అర్హుడికి ప్రభుత్వ గ్యారెంటీ పథకాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రతి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో, అదేవిధంగా మున్సిపాలిటీలో అవసరమైన మేర ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎస్ తెలిపారు.

తెల్ల రేషన్ కార్డు, ఆధార్ సంఖ్య , గ్యాస్ కనెక్షన్ నెంబర్ విద్యుత్ మీటర్ నెంబర్ ప్రజా పాలన దరఖాస్తుల్లో సమర్పించిన వారందరికీ పథకాలు అమలు అవుతాయని, ఇప్పటివరకు సదరు సమాచారం ప్రజాపాలన దరఖాస్తుల సమర్పించని వారు ప్రజా పాలన సేవా కేంద్రాలలో తమ వివరాలు అప్డేట్ చేసుకుంటే పథకాల లబ్ధి పొందవచ్చని సిఎస్ తెలిపారు.

ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని లబ్ధిదారులు కూడా ప్రజా పాలన సేవ కేంద్రాల ద్వారా తమ వివరాలు సమర్పించి ప్రభుత్వ గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని సి ఎస్ అన్నారు.

ప్రజా పాలన సేవా కేంద్రాల ఏర్పాటు కోసం అవసరమైన మేర డాటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించాలని, ప్రతి ప్రజాసేవ కేంద్రంలో అవసరమైన కంప్యూటర్లు ప్రింటర్ తదితర సామాగ్రి సిద్ధం చేసుకోవాలని , ప్రజా పాలన సేవ కేంద్రాల ఏర్పాటు పై విస్తృత ప్రచారం కల్పించాలని సి ఎస్ అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జడ్పీ సీఈవో ఉమారాణి, డీఐఈఓ మోహన్, డీఈఓ రమేష్ కుమార్, డీపీఓ వీర బుచ్చయ్య, డీసీఎస్ఓ జితేందర్ రెడ్డి, ఎండీ సెస్ సూర్య చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అంటూ వచ్చేసిన క్లారిటీ.. ఆ రేంజ్ లో నట విశ్వరూపం చూపిస్తారా?