గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి మరకలు…!

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో ఓ ఉన్నతాధికారి అన్నీ తానై చక్రం తిప్పుతూ ప్రతీ పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారడమే కాకుండా కింది స్థాయి సిబ్బందిని వేధిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సదరు అధికారికి చేయి తడపందే ఏ బిల్లులైనా,పదోన్నతుల ఫైళ్లయినా,మరేవైనా సరే ముందుకు కదలవని,చివరికి వసతి గృహాల వార్డెనలనూ సైతం వదలడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎవరైనా కాదూ,కూడదని ఎదురు తిరిగితే ఆయన ఉగ్రరూపం చూడాల్సిందేనని, ఆయన తీరుతో కిందిస్థాయి అధికారులు,ఉద్యోగులు వేధింపులు భరించలేక ఆరోపణలు చేసినా,విమర్శించినా కక్ష సాధింపు చర్యలు,మానసిక వేధింపులను చవిచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.

తన దారికి రాని పక్షంలో తనకు అనుకూలురైన బయటి వ్యక్తులను మధ్యవర్తులు రంగంలోకి దింపి, వారిని దారికి తెచ్చుకుంటారని వినికిడి.

అతని ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నా,తమకేమీ సంబంధం లేదన్నట్లు ఉన్నతాధికారులు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఆయన ఆ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ గా చేరి,ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న విధానమే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు సమాచారం.

కారణాలేవైనా,ఆయనకు వరుసగా ఉద్యోగోన్నతులు కల్పించి,ఏకంగా కీలక స్థానంలో కూర్చోబెట్టారు.దీని వెనుక భారీస్థాయిలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సొంత జిల్లా కావడం,సుదీర్ఘంగా ఇక్కడే తిష్టవేయడంతో అతని అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందంటారు.

కారుణ్య నియామకాల్లో ఒక్కో అభ్యర్ధికి రూ.2 లక్షలు,పెన్షన్ మంజూరు కావాలంటే రూ.

50 వేలు,విదేశాలకు వెళ్ళే విద్యార్దులు రూ.50 వేలు ఇస్తేనే పైలు ముందుకు కదులుతుందట.

అంతేకాదు గత ప్రభుత్వం ఉపకార వేతనాలు విద్యార్థుల అకౌంట్లలో వేసి ఏటీఎం కార్డులను విద్యార్థులకు ఇచ్చేవారు.

కొన్ని కాలేజీలతో కుమ్మక్కై ఉపకార వేతనాలను డ్రా చేసి సొమ్ము చేసుకున్నట్లు, చివరికి సంక్షేమ శాఖలో వసతి గృహాల వార్డెన్ల నుండి భారీ ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆయన అనుమతి లేకుండా ఉద్యోగోన్నతి పొందినా,ఉన్నతస్థాయి అధికారులు సంతకాలు చేసినా ఇక అంతే సంగతులు.

దానిపై రచ్చ చేసి,ఉన్నతస్థాయి అధికారులను కూడా దారిలోకి తెచ్చుకోవడంలో సిద్ధహస్తుడని ఆ శాఖ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

తన ప్రమేయం లేకుండా పనులు చేశారన్న అక్కసుతో గతంలో ఓ డీడీ స్థాయి మహిళా అధికారిని సైతం ఇబ్బందులకు గురి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.

విధులకు డుమ్మా కొట్టినా, వసతి గృహాల్లో అక్రమాలు బయటికి వచ్చినా,భవన నిర్మాణాలలో అక్రమాలు వెలుగు చూసినా స్లాబుల వారీగా ధరలు నిర్ణయించి డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారిందని అంటారు.

క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై ఏకంగా ఆ శాఖ రాష్ట్ర అధికారులను,జిల్లా కలెక్టర్ ను సైతం బురిడీ కొట్టించి, అవసరమైతే రాజకీయంగా అధికార పార్టీ కార్డు వాడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుకుంటారు.

ఇప్పటికైనా జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపిస్తే విస్తుపోయే విషయాలు బహిర్గతం కానున్నాయని అంటున్నారు.

అవినీతి ఆరోపణలపై సదరు అధికారిని వివరణ కోరగా తనకు డబ్బులు ఎవరూ ఇవ్వలేదని, ఎలాంటి అక్రమాలకు,అవినీతికి పాల్పడలేదని,కావాలని నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈజీగా కొట్టిపారేశారు.

నారా లోకేష్ చొరవ.. ఆ నరకం నుంచి విముక్తి, ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు