పోలీస్‌ శాఖపై స్పెషల్‌ ఫోకస్‌…!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో వివిధ శాఖల ప్రక్షాళన అధికారుల మార్పు జరగనుందని అన్ని ప్రభుత్వ శాఖల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

దీంతో గత పాలకుల చేతిలో అణచివేతకు గురైన ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

ఏళ్ల తరబడి అప్రాధాన్య పోస్టింగ్‌ల్లో కొనసాగిన సిబ్బందికి ఇప్పుడు ఛాన్స్ వస్తుందనే నమ్మకం ఏర్పడింది.

అయితే మొదట పోలీస్‌ శాఖపైనే ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రజా రక్షణ,శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మొదట గ్రేటర్‌ హైదరాబాద్‌,సైబరాబాద్ పరిధిలోని కమిషనరేట్‌లను ప్రక్షాళన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మితిమీరిన రాజకీయ జోక్యంతో కొంతకాలంగా పోలీస్‌ డిపార్టుమెంట్‌ పని చేసిందని చెప్పడం అతిశయోక్తి కాదు.

పోలీస్‌ ఉన్నతాధికారులు మొదలుకొని డీసీపీలు, అడిషనల్‌ డీసీపీలు, ఏసీపీలు,ఇన్‌స్పెక్టర్‌లు, చివరకు సబ్‌ ఇన్‌స్పెక్టర్ల వరకు స్థానిక ప్రజా ప్రతినిధులు నచ్చిన మెచ్చిన అధికారులకే పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పోలీసుల బదిలీలే అందుకు నిదర్శనం.

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో చేసిన బదిలీలు కాకుండా స్థానిక రాజకీయ నాయకులు మళ్లీ గెలవడానికి తన అనుచరులకు పోస్టింగ్‌లు ఇప్పించుకోవడానికి జరిగిన బదిలీలుగా విమర్శలు వెల్లువెత్తాయి.

కొన్నిచోట్ల స్థానిక నేతకు నచ్చని ఇన్‌స్పెక్టర్‌ ఏసీపీలకు పోస్టింగ్‌ ఇచ్చిన సీపీలపై స్థానిక నేతలు ఊగిపోయారు.

ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి మరీ వారి అనుచరులకు పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు.రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొనడంతో పోలీసుల బదిలీలపై ఎన్నికల కమిషన్‌( Election Commission )కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కొంతమంది ఇన్‌స్పెక్టర్‌లు,ఏసీపీలు డీసీపీలు అప్పటి ప్రభుత్వ పెద్దలకు విధేయులుగా ఉంటూ కాసులు కురిపించే ప్రాంతాల్లో పోస్టింగ్‌లు పొంది,రూ.

కోట్లలో సంపాదించారనే విమర్శలూ ఉన్నాయి.ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అణిచివేతకు గురై లూప్‌లైన్‌ పోస్టింగ్‌ల్లో కొనసాగిన సిబ్బందిలో కొత్త ఆశలు చిగురించాయి.

కొత్త ప్రభుత్వం సిబ్బంది పనితీరును ప్రతిభను గుర్తిస్తుందని గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన వారికి మంచి పోస్టింగ్‌లు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తుందని నమ్ముతున్నారు.

పోలీస్‌ శాఖపై దృష్టి సారించిన ప్రభుత్వం ముందుగా ట్రై కమిషనరేట్‌ సీపీలను ఇతర ఉన్నతాధికారులను మార్చి కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఇప్పటికే డీసీపీ అంజనీ కుమార్‌ను సస్పెండ్‌ చేసిన ఎన్నికల కమిషన్‌ కొత్త డీజీపీగా రవిగుప్తా( Ravigupta )కు అవకాశం కల్పించింది.

అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు హైదరాబాద్‌ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసింది.

ఆయన స్థానంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సందీప్‌ శాండిల్యను సిటీ సీపీగా నియమించింది.

ఎన్నికల నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్న సీపీ తన పనితీరుతో అందరి దృష్టిని ఆకర్శించారు.

అయితే కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పోలీస్‌ ఉన్నతాధికారులను కొనసాగిస్తుందా? లేక కొత్తవారిని నియమిస్తుందా? అనేది కొద్దిరోజుల్లో తేలనుంది.

ఇప్పటికే కొంతమంది సిబ్బంది పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు డిపార్టుమెంట్‌లో చర్చ జరుగుతోంది.

వైసీపీ హయాంలో పోలవరం పనులపై మాజీమంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..!!