కార్యదర్శి చెంప ఛెళ్లుమనిపించిన గులాబీ లీడర్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఐఏఎస్,ఐపీఎస్ లంటేనే గౌరవం లేకుండా బండ బూతులు తిట్టిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.
అలాంటిది ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి అంటే వారికి లెక్కుంటుందా చెప్పండి.అందుకే మీరెల్లే దారిలోనే మేమొస్తామంటూ ఓ టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తన పవరేంటో చూపెట్టాలని గ్రామ ప్రజల ముందే,పంచాయతీ కార్యాలయంలోనే డ్యూటీలో ఉన్న గ్రామ కార్యదర్శిపై దాడి చేశాడు.
ప్రస్తుతం ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతుంది.వివరాల్లోకి వెళితే
కోదాడ రూరల్ మండలం కాపుగల్లు గ్రామపంచాయతీ కార్యదర్శిగా వెంకటనారాయణ విధులు నిర్వహిస్తున్నారు.
అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బాలబోయిన పాపారావు ఉపాధి హామీ పనుల్లో కొందరు పని చేయకుండా హాజరు వేయించుకుంటున్నారని కార్యదర్శికి ఫోన్ చేసి చెప్పాడు.
దానికి స్పందించిన కార్యదర్శి విచారణ చేసి వాస్తవాలు ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయానికి కార్యదర్శి చేరుకున్న వెంటనే టీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా ఆఫీసుకు వచ్చి నిన్న తాను చెప్పిన విషయంపై చర్యలు తీసుకున్నారా? అని అడిగాడు.
ప్రస్తుతం వేరే పనిమీద ఉన్నానని,ఇది పూర్తయ్యక అక్కడికే వెళ్తానని కార్యదర్శి సమాధానమిచ్చాడు.చెప్పిన పని చేయకుండా వేరే పని చేస్తావా అంటూ చిర్రెత్తుకొచ్చిన సదరు గ్రామ శాఖా అధ్యక్షుడు ఏకంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో,గ్రామస్తుల సమక్షంలోనే కార్యదర్శి చెంప చెల్లుమనిపించాడు.
ఆగ్రహంతో ఊగిపోతూ తాను ఫోన్ చేసినా చర్యలు తీసుకోవా? అంటూ దుర్భాషలాడుతూ వెళ్లిపోయాడు.
అక్కడే ఉన్న గ్రామస్తులు విషయం తెలియక చూస్తూ ఉండిపోయిన ప్రజలను అడిగితే అధికార పార్టీ నాయకులు చెబితే పని చేయవా అంటూ కార్యదర్శిపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడినట్లుగా ప్రజలు చెబుతున్నారు.
ఇదే విషయమై కార్యదర్శిని అడగగా ఉపాధి హామీ పనుల్లో హాజరు విషయంలో చర్యలు తీసుకోవాలని నాకు ఫోన్ ద్వారా గతరోజు సాయంత్రం సమాచారం అందించారు.
గురువారం ఉదయం తప్పకుండా చూస్తానని చెప్పినప్పటికీ, వినకుండా నాపై దాడికి పాల్పడ్డారని,సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కార్యదర్శిపై దాడి జరిగిన విషయం తెలిసి గ్రామ కార్యదర్శుల సంఘం నేతలు భగ్గుమన్నారు.
సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోదాడ ఎంపిడిఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామ కార్యదర్శులు మాట్లాడుతూ విధుల్లో ఉన్న కార్యదర్శిపై దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నాయుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేకపోతే మండల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.అనంతరం ఎంపిడిఓకు వినతిపత్రం సమర్పించారు.
ఉచిత గ్యాస్ పథకం.. అక్కడికి వెళ్లి టీ పెట్టిన సీఎం చంద్రబాబు