'సర్కారు వారి పాట', పోకిరి కి మించిన బ్లాక్ బస్టర్ అవుతుంది: 'సర్కారు వారి పాట' స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఇంటర్వ్యూ
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' విడుదలకు సిద్దమౌతుంది.
మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై.
రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
తాజాగా 'సర్కారు వారి పాట' కు పనిచేసిన స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె.
వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు.ఆయన పంచుకున్న 'సర్కారు వారి పాట' విశేషాలు.
దర్శకుడు పరశురాం గారు ఈ కథ చెప్పినపుడు.ఇంతకుముందు మీరు చేసిన సినిమాలకి 'సర్కారు వారి పాట'కి ఎలాంటి తేడా గమనించారు ?
దర్శకుడు పరశురాం గారి సినిమాలు ఫ్యామిలీ డ్రామా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా వుంటాయి.
కానీ సర్కారు వారి పాట లో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా వుంటాయి.
గీత గోవిందం, పోకిరి.ఈ రెండు సినిమాలు నేనే ఎడిట్ చేశాను.
ఈ రెండు సినిమాలు కలిపితే ఎలా వుంటుందో సర్కారు వారి పాట అలా వుంటుంది.
పోకిరికి మించి సర్కారు వారి పాట హిట్ అవుతుంది.సర్కారు వారి పాటలో మంచి ఫీల్ వుంటుంది.
అందరికీ కనెక్ట్ అయ్యే మెసేజ్ వుంది.నేను చేసిన సినిమాలన్నీటి కంటే మహేష్ బాబు ఈ సినిమాలో చాలా అందంగా వుంటారు.
ఫ్యాన్స్, ఫ్యామిలీస్, మాస్ కి ఈ సినిమా చాలా నచ్చుతుంది.ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఫుల్ గా, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ తో అదిరిపోతుంది.
పోకిరి తర్వాత మహేష్ బాబు గారి చాలా హిట్స్ వచ్చాయి కదా? మరి పోకిరితోనే పోల్చడానికి కారణం ?
పోకిరి నేను ఎడిటర్ గా చేసిన సినిమా.
అందుకే పోకిరితో పోల్చాను.పోకిరి రష్ చూసినప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పా.
సర్కారు వారి పాట ఫస్ట్ రష్ చూసిన తర్వాత పోకిరిని క్రాస్ చేస్తామని చెప్పా.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ ట్రాక్ లో తెగ నవ్వుకున్నా.
సెకండ్ హాఫ్ లో వారు ఎక్కడ కలిసిన చిన్న లాఫ్ వుండేది.థియేటర్ లో ఈ సందడి పెద్దగా ఉంటుందని మా అంచనా.
మహేష్ బాబు ఫ్యాన్స్ కి సర్కారు వారి పాట ఒక పెద్ద పండగలా వుంటుంది.
విజువల్స్ చాలా గ్రాండ్ కనిపించడానికి మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్ టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ సంయుక్త నిర్మాణం కారణమని భావిస్తున్నారా ?
అవునండీ.
దర్శకుడు పరశురాం గారి సినిమాలు చేశాను.కానీ ఫస్ట్ టైం సర్కారు వారి పాట కోసం మైత్రి మూవీ మేకర్స్ ,జీ ఎం బీ ఎంటర్ టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ లో పని చేశాను.
నిర్మాణ విలువలు వండర్ ఫుల్ గా వున్నాయి.వీరు అంతా సినిమాని రిచ్ గా తీయాలనే లక్ష్యంగా వుంటారు.
సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడరు.సినిమా పట్ల వారికున్న అంకితభావం అభినందనీయం.
ఇది చాలా మంచి అనుభవం.దర్శకుడు పరశురాం గారి సినిమాలు క్లాస్ గా వుంటాయి.
సర్కార్ వారి పాటలో ఇప్పటివరకూ అంతా మాస్ గానే కనిపిస్తుంది ?
ఇందులో అన్ని ఎలిమెంట్స్ వున్నాయి.
హీరో, హీరోయిన్ పాత్రలని ఇష్టపడతాం.హీరోయిన్ పాత్ర చూసినప్పుడు ఇలాంటి అమ్మాయి మనకీ వుంటే బావున్ననిపిస్తుంది.
హీరో పాత్రతో కనెక్ట్ అవుతాం.ఎడిట్ చేసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలిగితే ఆ సినిమా సూపర్ హిట్ అని జడ్జ్ చేస్తాం.
ఎడిట్ చేస్తున్నపుడు సర్కారు వారి పాటకి అద్భుతంగా కనెక్ట్ అయ్యాం.సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వుంది.
ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేశారు ?
ఇప్పటి వరకూ 450 సినిమాలు చేశాను.
మహేష్ గారితో రాజకుమారుడు, టక్కరి దొంగ,పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.ఇప్పుడు సర్కారు వారి పాటకి చేశాను.
రీలు కంటింగ్ కి, డిజిటల్ కంటిగ్ కి ఎలాంటి తేడా వుంది ?
రీలు కంటింగ్ లో ఎడిటర్ కి రెస్పెక్ట్ వుండేది.
ఎవరు చూడాలన్నా ఎడిటింగ్ రూమ్ లోకి రావాలి.పైగా అది హార్డ్ వర్క్.
ఇన్ని సినిమాలు చేయలేం, డిజిటల్ వల్ల ఎక్కువ సినిమాలు ఎక్కువ చేయగలుగుతున్నాం.రీలు ఎడిటింగ్ లో ఏడాదికి పది సినిమాలు చేయడం గొప్ప.
డిజిటల్ వచ్చిన తర్వాత ఏడాది ఇరవై సినిమాలు కూడా చేయొచ్చు.రీలు ఎడిటింగ్ లో ఎడిటర్ కి రెస్పెక్ట్ ఉండేదని అన్నారు .
అంటే డిజిటల్ లో రెస్పెక్ట్ లేదా ?
రీలు ఎడిటింగ్ ఒకటే వెర్షన్ వుండేది.
డైరెక్టర్, ఎడిటర్ కలసి సినిమాని ఫైనల్ చేసేవారు.నిర్మాతలు కథ విని దానికి ఎవరు హీరో అయితే బావుంటుదని వెళ్ళేవారు.
కానీ ఇప్పుడు అంతా రివర్స్ లో వుంది.ఇప్పుడు సెట్ లోనే ఎడిట్ చేస్తున్నారు కదా ?
సెట్ లో చేసేది పక్కా ఎడిటింగ్ కాదు.
ఆ సీన్ వరకే చేస్తారు.ఫైనల్ ప్రోడక్ట్ , స్క్రీన్ ప్లే ఎడిటింగ్ రూం నుండే వెళ్తుంది.
దర్శకుడు పరశురాం తో చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నారు.అప్పటికి ,ఇప్పటికి ఆయనలో ఎలాంటి మార్పులు గమనించారు ?
పరశురాం అద్భుతమైన రచయిత.
మంచి డైలాగ్స్ రాస్తారు.హీరో, హీరోయిన్స్ పాత్రలు డిఫరెంట్ గా డిజైన్ చేస్తారు.
సర్కారు వారి పాటలో మహేష్ బాబు గారి పాత్ర అదిరిపోతుంది.ఈ మధ్యలో కాలంలో ఇలాంటి పాత్రని చుసివుండరు.
హీరో క్యారెక్టరైజేషన్ లోనే బోలెడు వినోదం వుంటుంది.చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్ముతున్నాను.
దర్శకుడు పరశురాం ఫస్ట్ టైమ్ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నారు.
కథ ఓకే అయిన తర్వాత మీతో పంచుకున్న విశేషాలు ఏమిటి ?
దర్శకుడు పరశురాం నాకు చాలా సన్నిహితంగా వుంటారు.
ఈ కథని గీత గోవిందం సినిమా సమయంలోనే నాకు చెప్పారు.అద్భుతంగా ఉందని అప్పుడే చెప్పా.
సర్కారు వారి పాట చూసిన తర్వాత మహేష్ బాబు గారి రియాక్షన్ ?
అందరూ చాలా హ్యాపీగా వున్నారు.
సర్కారు వారి పాట చాలా పెద్ద సినిమా అవుతుంది.నేను చేసిన సినిమాల్లో పోకిరిని క్రాస్ చేస్తుంది.
అన్ని సాంకేతిక విభాగాల్లో కొత్త వారి పేర్లు వినిపిస్తుంటాయి.కానీ ఎడిటింగ్ లో మాత్రం ఓ ముగ్గురు పేర్లే వినిపిస్తాయి.
ఇంత లాంగ్ కెరీర్ ఎలా సాధ్యమైయింది? ఎడిటింగ్ లోకి కొత్తతరం రావడం లేదా ? రానివ్వడం లేదా ?
తరం అని కాదు, మేము కూడా ఆ తరాన్ని దాటుకునే వచ్చాం కదా.
కొందరు యూత్ ఫుల్ ఫిల్మ్స్ అంటారు.అంటే మేము యూత్ కాదా? కోమాలో వున్నామా ? దాన్ని దాటే కదా వచ్చాం.
వయసుకి సినిమాకి సంబంధం లేదు.ఆ తరాన్ని దాటునికొని వచ్చాం కాబట్టి కథని ఇంకా బాగా చెప్పగలం.
ఎక్కువ సార్లు ఎడిట్ చేయడం వల్ల మీ జడ్జ్ మెంట్ కి ఏమైనా ఇబ్బంది వస్తుందా ?
అలా వుండదు.
రష్ చూసినపుడు మొదట వచ్చిన ఫీలింగ్ కే కనెక్ట్ అవుతాం.ఎడిటర్ రూమ్ లో చాలా చర్చలు జరుగుతుంటాయి.
ఎడిటర్ అభిప్రాయాన్ని డైరెక్టర్ అంగీకరిస్తారా?
ఖచ్చితంగా.సినిమా కోసమే కదా గొడవలు పడతాం.
ఆడిటోరియం లో చూసేది మేము ముందుగానే చెప్తాం.నేను పని చేసే దర్శకులంతా నా అభిప్రాయాన్ని తీసుకుంటారు.
మీరు బలంగా నమ్మి నిరాశపడిన సినిమా ఏదైనా ఉందా ?
శేఖర్ కమ్ముల లీడర్.
ఈ సినిమా పొలిటికల్ సినిమాల్లో చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మాం.కానీ టీవీలో వచ్చినంత స్పందన రిలీజ్ టైం లో రాలేదు.
టెక్నాలజీ పెరిగిన తర్వాత లీకేజీలు పెరిగాయి.దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
మాకు బాగా నమ్మకం వున్న వాళ్ళనే తీసుకుంటాం.
తెలియనివారిని అస్సలు పెట్టుకోము.దీనికి కారణం లికేజీలే.
మొదట్లో రీలు వుండేది.ఎడిటింగ్ రూమ్, ల్యాబ్ లో ప్రింట్ అయిన రీలు మాత్రమే వెళ్ళాలి.
కానీ ఇప్పుడు ప్రతిదానికి అవుట్ పుట్ వెళ్ళిపోతుంది.అందుకే ప్రతిదానికి డేట్ తో సహా వాటర్ మార్క్ వేస్తాం.
ఒక సినిమాకి కూడా పనిచేసే అనుభవం లేని దర్శకులు ఇప్పుడు వస్తున్నారు.ఇలాంటి వారితో పని చేయడం ఎలా వుంటుంది ?
ఎడిటర్ గా మాకు చిన్న చిన్న సమస్యలు వుంటాయి.
ఫైట్ మాస్టర్ మొత్తం ఫైట్ వుండాలంటారు.టాప్ యాంగిల్ లో కస్టపడి తీసిన షాట్ ఎందుకు పెట్టలేదని కెమరామెన్ అంటారు.
సినిమాకి అక్కర్లేదని మేము తీసేసుంటాం.ఇలాంటి చిన్నచిన్న ఆర్గుమెంట్స్ జరుగుతాయి.
ఫైనల్ కాల్ మాత్రం దర్శకుడిదే.ఎడిటింగ్ కి సంబధించిన విమర్శలని ఎలా తీసుకుంటారు ?
విమర్శ మంచిదే.
అయితే అది నిర్మాణాత్మకంగా వుండాలి.పది నిమిషాలు తగ్గించుంటే బావుంటుందని చెప్తారు.
ఏం తగ్గించాలో చెప్పరు, ఏ సీన్ బాలేదో చెప్పరు.ఇలా చెప్తే దాని గురించి ఆలోచిస్తాం.
మాకూ కొంచెం హెల్ప్ ఫుల్ గా వుంటుంది.పెద్ద సినిమాకి చివరి నిమిషం వరకూ ఎడిటింగ్ చేస్తూనే వుంటారు.
దానివలన ఒత్తిడిపెరుగుతుందా ?
ఒత్తిడి ఖచ్చితంగా వుంటుంది.ఓవర్సిస్ కి మూడు రోజులు ముందే వెళ్ళాలి.
అంటే నాలుగు రోజులకి ముందే ఇచ్చేయాలి.దర్శకులకు చివరి నిమిషం వరకూ ఏదో చేయాలనే తాపత్రయం వుంటుంది.
చూసింది పదిసార్లు జాగ్రత్తగా చూసి చివరి క్షణం వరకూ దానిపై చర్చజరుగుతుంది.ఇది ప్రతి సినిమాకి వుంటుంది.
పాన్ ఇండియా సినిమాలు విదేశాలకు వెళ్ళినపుడు నిడివి తగ్గిస్తారా ?
లేదు.అవార్డ్ లకి వెళ్ళే సినిమాకి మాత్రం పాటలు తీసేస్తాం.
ఇండియన్ లాంగ్వేజస్ కి మాత్రం ఒక ఎడిట్ నే వెళుతుంది.ఇన్నేళ్ళ కెరీర్ లో మీ ఫేవరేట్ సినిమా ?
ఫేవరేట్ అని ఏమీ లేదు.
కొన్ని సినిమాలు చూసినపుడు ఇలాంటి సినిమా మనం చేస్తే బావుండేదనిపిస్తుంది.మీతోటి ఎడిటర్స్ మధ్య ఎలాంటి అనుబంధం వుంది?
మంచి అనుబంధమే వుంది.
వర్క్ గురించి మాట్లాడుకుంటాం.మా కష్టాలు చెప్పుకుంటాం.
సినిమా బాగా చేస్తే ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటాం.ఒక సినిమాని విజయవంతం చేయడంలో ఎడిటర్ పాత్ర ఎంత వుంటుంది ?
ఒక దర్శకుడికి ఎడిటర్ కి రిలేషన్ షిప్ బావుంటే చాలా మంచి సినిమా అవుతుంది.
ఎంత ఆర్గుమెంట్స్ జరిగితే రిజల్ట్ అంత మంచిగా వస్తుంది.డైరెక్టర్ తన స్వేఛ్చతో ఎడిటర్ ని ఎన్నుకుంటాడా ? హీరో జోక్యం వుంటుందా ?
ఒకొక్క సినిమాకి ఒకొక్కలా వుంటుంది.
'సారోచ్చారా' తప్పితే పరశురాం అన్ని సినిమాలకి నేనే చేశా.దర్శకుడి తరపున వెళితే ఎడిటర్ బలంగా ఉంటాడు.
పాన్ ఇండియా సినిమాలని తెలుగు కాకుండా ఇతర భాషల్లో చూసినపుడు ఏమైనా తేడా ఉంటుందా ?
అలా ఏమీ వుండదు.
కానీ రిమేక్ కి వచ్చేసరికి కొంచెం తేడా వుంటుంది.మలయాళం దృశ్యం నీట్ గా స్లోగా వుంటుంది.
తెలుగులో చేసినప్పుడు ఇక్కడ ఆడియన్స్ తగ్గట్టు మన స్టయిల్ లో చేశాం.కొత్తగా చేస్తున్న సినిమాలు ?
చిరంజీవి గారి గాడ్ ఫాదర్, భోళా శంకర్, సమంత కధానాయికగా యశోద సినిమాలకి చేస్తున్నా.