విజృంభిస్తున్న విష జ్వరాలు…పడకేసిన పారిశుద్ధ్యం

నల్లగొండ జిల్లా:వేములపల్లి మండలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.డెంగ్యూ,మలేరియా వంటి విషజ్వరాల తో పల్లెలు మొత్తం మంచం పట్టాయి.

రోజురోజుకూ దోమకాటు బాధితుల సంఖ్య పెరుగుతూ రావడంతో మండల ప్రజలు హడలెత్తిపోతున్నారు.ప్రభుత్వ,ప్రైవేట్,ఆర్ఎంపీ ఆసుపత్రులు జ్వర పీడుతులతో కిటకిట లాడుతున్నాయి.

ఈ విష జ్వరాలకు కారణమైన పరిసరాల పరిశుభ్రత పల్లెల్లో పూర్తిగా పడకేసింది.స్వచ్చదనం-పచ్చదనం పేరుతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి అధికారులు చేతులు దులిపేసుకోగా,గ్రామాల బాగోగులు చూడాల్సిన అధికారులు అడ్రస్ లేకుండా పోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కనీసం గ్రామాల్లో రోజూవారి పారిశుద్ధ్య పనులు చేయిస్తూ,బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ,దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురిస్తుందని వాపోతున్నారు.

విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో పలు గ్రామాల ప్రజలు పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,మురికి కాలువలు శుభ్రం చేయాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలు పడుతున్నాయన్న సంబరం కంటే జ్వరాలు సోకుతున్నాయనే ఆందోళనే ప్రజల్లో ఎక్కువగా కనబడుతోంది.

స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాలు చేపట్టి చాలా చోట్ల నీటి నిల్వలు,దోమల ఆవాస కేంద్రాలు లేకుండా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కనపడడం లేదని పెదవి విరుస్తున్నారు.

పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పెద్దమొత్తంలో మలేరియా, డెంగ్యూ,వైరల్‌ ఫీవర్‌ భారినపడి జలుబు,దగ్గు,తీవ్ర జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల వద్ద జనం క్యూకడుతున్నారు.

మరికొందరు తీవ్రజ్వరం,కప్పంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడడంతో ఆయా ఆసుపత్రులలో ఇన్‌పేషంట్‌ లుగా చేరి రోజుల తరబడి చికిత్సలు పొందుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యంపై,దోమలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సీతారామం మూవీలో హీరో రోల్ అందుకే చనిపోతుంది.. హను రాఘవపూడి షాకింగ్ కామెంట్స్!