సాగర్ ప్రాజెక్ట్ లొల్లి మళ్ళీ షురూ అయిందా…?

నల్లగొండ జిల్లా:దాదాపు రెండేళ్ల తర్వాత నాగార్జున సాగర్ డ్యాంకు జలకళ వచ్చింది.ఎగువ నుండి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల ద్వారా కిందకు నీటి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అయితే గత రెండు రోజులుగా వరద ఉధృతి తగ్గడంతో 18 క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలుపుద‌ల చేసి,సోమవారం మ‌ధ్యాహ్నం అన్ని గేట్ల‌ను మూసివేశారు.

మ‌ధ్యాహ్నం వ‌ర‌కు క్రస్ట్‌ గేట్ల ద్వారా 1.43 లక్షల క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,541 క్యూసెక్కులు,కుడికాలువకు 3937 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 29,273 క్యూసెక్కుల నీటిని వ‌దిలారు.

సాగర్‌ పూర్తి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.80 అడుగులకు,గరిష్ఠ నీటినిల్వ 312.

50 టీఎంసీలకు గాను 305.46 టీఎంసీలకు చేరుకుంది.

ఇదిలా ఉంటే సాగర్‌లో ఏపీ అధికారుల దౌర్జన్యం మళ్ళీ తెరపైకి వచ్చింది.నాగార్జునసాగర్‌ డ్యామ్‌ వద్ద ఆంధ్రా,తెలంగాణ లొల్లి మళ్ళీ షురూ అయిందని తెలుస్తోంది.

ఆదివారం ఆంధ్రాకు సంబంధించిన సుమారు 20 మంది అధికారులు ఏపీ సీఎం పేషీ నుంచి డ్యామ్ వద్దకు వచ్చారు.

అయితే క్రస్ట్‌ గేట్ల సమీపానికి వెళ్లడానికి అనువుగా కొన్నేండ్ల క్రితం వాక్‌వే బ్రిడ్జిని ఏర్పాటు చేసి,దానికి ఆంధ్రా,తెలంగాణ రెండు వైపులా గేట్లు ఏర్పాటు చేసి,నిర్వహణ పూర్తిగా తెలంగాణ అధికారులు చేపడుతున్నారు.

ఆంధ్రానుంచి వచ్చిన అధికారులు వాక్‌వే బ్రిడ్జి గేట్‌కు తాళం వేసి ఉండటంతో తెలంగాణ ఎన్నెస్పీ అధికారులను తాళంచెవి అడిగారు.

కొంత సమయం పడుతుందని తెలంగాణ అధికారులు చెప్పడంతో ఆంధ్రా అధికారులు దౌర్జన్యంగా గేట్‌ తాళం పగులగొట్టి వాక్‌వే బ్రిడ్జి మీదికి వెళ్లిపోయారు.

దీనితో 13వ,గేట్‌ వరకు తమ ఆధీనంలో ఉందని,ఆంధ్రా అధికారులు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, డ్యామ్‌పై కంట్రోల్‌ రూమ్‌ 26వ,గేట్‌ అవతల ఉందని, అక్కడికి వెళ్లి డ్యూటీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని టీజీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు,వీడియోలు తెలంగాణ ఉన్నతాధికారులకు పంపించినట్టు సమాచారం.ఈ ఘటనపై డ్యామ్ ఈఈ మల్లికార్జునరావును వివరణ కోరగా ఆంధ్రా అధికారులు తాళం పగులగొట్టిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.డ్యామ్‌పై పహారా కాస్తున్న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆంధ్రా నుంచి ఎవరు వచ్చినా అనుమతిస్తున్నారని వాపోయారు.

కోపంతో రోడ్డుపై బీభస్తాన్ని సృష్టించిన ఏనుగు.. వీడియో వైరల్