పండుగ దృష్ట్యా రహదారిపై రక్షణ చర్యలు: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది,కావున జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 65 పై ఎలాంటి రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా జిల్లా పోలీసు నివారణ చర్యలు చేపట్టడం జరిగినదని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.

గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని,అతివేగంతో వాహనాలు నడవద్దని, నిద్ర మత్తులో వాహనాలు నడపవద్దని,దూర ప్రయాణం వల్ల అలసిపోవడం,నిద్ర మత్తు కారణంగా ప్రమాదాలకు జరిగే అవకాశం ఉన్నదని, అందుకే ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

వాహనాలు కండిషన్ లో ఉండాలని, చలి ప్రభావం,పొగమంచు ఉంటుంది కాబట్టి రాత్రి ప్రయాణంలో డ్రైవర్ అప్రమత్తత అవసరమని చెప్పారు.

అత్యవసర సమయంలో రహదారుల అధికారులను లేదా డయల్ 100 కు పొన్ చేసి సహాయం పొందాలని, రోడ్డు ప్రక్కన అనధికారికంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దని విజ్ఞప్తి చేశారు.

భారీ వాహనాలు ఒక క్రమంలో వెళ్ళాలని,ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని అన్నారు.ముఖ్యంగా జాతీయ రహదారి వెంట గల సూర్యాపేట రూరల్, చివ్వెంల,మునగాల, కోదాడ మండలాల పరిధిలో గల గ్రామాల రైతులు, ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు మార్గంలో వాహనాలు,పశువులను తీసుకువెళ్లడం ప్రమాదమని గమనించాలని అన్నారు.

సిబ్బంది రోడ్లపై గస్తీ నిర్వహించాలని,పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.తప్పుడు మార్గంలో వాహనాలు నడిపినా,రోడ్లపై న్యూసెన్స్ చేసినా,ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆపితే కేసులు నమోదు చేయాలన్నారు.

నిత్యం వాహనాలు తనిఖీలు చేస్తూ మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్,రాంగ్ రూట్ డ్రైవింగ్,ఓవర్ లోడింగ్ నిరోధించాలని సిబ్బందిని దిశానిర్దేశం చేశారు.

మరింత భారం కానున్న రీఛార్జిలు.. నిన్న జియో, నేడు ఎయిర్టెల్.. ఇకబాదుడే..