ఫ్రీ బస్సు పథకానికి నోచుకోని పల్లె మహిళలు

సూర్యాపేట జిల్లా: పల్లెల్లో నివసించే ప్రజల రవాణా సౌకర్యం కోసం ప్రభుత్వం పల్లె వెలుగు పేరిట బస్సులు నడిపిస్తుంది.

కానీ,కొన్ని గ్రామాలకు మాత్రమే ఆ అవకాశం ఉండేది.కరోనా ఎఫెక్ట్ తో ఆయా రూట్లలో తిరిగే బస్సులను కూడా రద్దు చేశారు,ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదే విషయమై గ్రామీణ ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా మహిళలు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు బస్సు ఫ్రీ అయినా మా ఊరికి బస్సు లేనప్పుడు మాకేం లాభం అంటున్నారు.

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో మహిళా సంఘం సభ్యురాలు అంకతి అనసూర్య మాట్లాడుతూ కరోనా సమయంలో పల్లెల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులను నిలిపివేశారు.

మండలంలోని పాలవరం,చనుపల్లి, శాంతినగర్,మొగలాయికోట, గొండ్రియాల,వాయిలసింగారం, గోల్ తండా తదితర మారుమూల ప్రాంతాల గ్రామాల్లో బస్సు సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు,వివిధ అవసరాల నిమిత్తం పట్టణాలకు వెళ్లేవారు ఆటో చార్జీల పేరిట ఆర్థికంగా నష్టపోతున్నారు.

ప్రభుత్వం తెచ్చిన ఫ్రీ బస్సు పథకం పల్లె పడుచులకు వరమైతది అనుకుంటే,బస్సు లేక పోవడంతో భారమైందని,ఇకనైనా ఆర్టీసీ అధికారులు పల్లె వెలుగు బస్సులను పల్లెల్లో నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అప్పుడే ఫ్రీ బస్సు పథకానికి వన్నె వస్తుందని తెలిపారు.

నాగ్ అశ్విన్ ఆ ఒక్క విషయం ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు…