అమెరికాలో పీవీ విగ్రహం: తెలంగాణ సర్కార్ వేగం, పూర్తయిన స్థల పరిశీలన.. త్వరలోనే ఆవిష్కరణ

తెలుగు తేజం, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు మరింత గుర్తింపు దక్కేలా చొరవ తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఇప్పటికే ఆయన శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కూడా.తాజాగా పీవీ కీర్తిని దశదిశలా వ్యాప్తి చెందేలా చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

దీనిలో భాగంగా ప్రపంచంలోని ఐదు దేశాల్లో పీవీ నరసింహారావు విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు.

ఇందుకు వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు ఎన్ఆర్ఐల సహకారం కూడా తీసుకోనున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత అమెరికాలోని అట్లాంటా, జార్జియాలలో పీవీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే దీనికి సంబంధించి పలు ప్రవాసీ తెలుగు సంఘాలతో కేసీఆర్ భేటీ అయ్యారు.

వీరందరితో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ మహేశ్ బీగాల సమన్వయం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలోని అట్లాంటాలో సన్నాహక సమావేశం జరిగింది.దీనికి పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మ‌హేశ్ బిగాల హాజరయ్యారు.

ముందుగా ఇటీవల కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ.అట్లాంటాలో రెండు మూడు ప్రదేశాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థల ప‌రిశీల‌న జరిగిందని చెప్పారు.

పీవీ విగ్రహాన్ని వచ్చే వారంలో అమెరికాకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయని మహేశ్.ప్రవాస భారతీయులకు తెలిపారు.

ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ చివరిలో పీవీ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ప్రముఖుల్ని, పీవీ కుటుంబసభ్యుల‌ను, అమెరికాలోని తెలుగు, ఇండియన్ కమ్యూనిటీనే కాకుండా ఇక్కడి రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు మహేశ్ తెలిపారు.

మరోవైపు మొట్ట మొదటి పీవీ విగ్రహాన్ని అట్లాంటాలో ఏర్పాటు చేస్తున్నందుకు అక్కడ వున్న అన్ని ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేసారు.

తెలంగాణా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పీవీ కమిటీ చైర్మన్ కే కేశవరావుకు, పీవీ కమిటీ సభ్యులకు ఎన్నారైలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని వారు హామీ ఇచ్చారు.

ఖైరతాబాద్ లో ప్రభుత్వ భూమిపై కబ్జా రాయుళ్ల కన్ను..!