ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలి: సిపిఎం

నల్లగొండ జిల్లా: యాసంగి సీజన్లో వేసిన పంటలు ఎండిపోకుండా వెంటనే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని నల్లగొండ జిల్లా వేములపల్లి మండల సిపిఎం కార్యదర్శి పాదురి శశిధర్ రెడ్డి అన్నారు.

ఆదివారం మండల పరిధిలోని మొలకప్పట్నం, సలుకునూరు,మంగాపురం తదితర గ్రామాల్లో స్థానిక రైతులతో కలిసి నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఎత్తిపోతల కింద చెరువులు ఎండిపోవటం వలన భూగర్భ జలాలు అడుగంటి పంటపొలాలకు నీరందక అన్నదాతలు అయోమయంలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత వాన కాలంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రైతులతో కలిసి గత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగా అప్పటి ప్రభుత్వం వెంటనే స్పందించి మొదటి విడత 12 రోజులు చెరువులు నింపడానికి,తాగు నీటి పేరుతో రెండోదపా 12 రోజులు నీటి విడుదల చేసి పంటలను కాపాడిందని గుర్తు చేశారు.

ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశలో ఉండగా చెరువులు,బోరు బావుల్లో నీరు లేని పరిస్థితి ఏర్పడిందని,దీనితో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు.

ఈ విషయంలో మాజీ,తాజా ఎమ్మేల్యేలు,జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయించి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు నాయకులు మద్దిరాల సత్యనారాయణ రెడ్డి, కోడిరెక్క వెంకన్న, బొమ్మగాని వెంకటయ్య, రెమిడాల భిక్షం,వల్ల మల్లయ్య,ఎడ్ల శ్రీను, పందుల భిక్షం,ఐతగాని వెంకన్న,పలువురు రైతులు పాల్గొన్నారు.

రజనీకాంత్ పాటకి అదిరిపోయే డ్యాన్స్ చేసిన చిలుక.. వీడియో వైరల్..