ముమ్మాటికి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్:బీసీ నేత ధనుంజయ నాయుడు

సూర్యాపేట జిల్లా:తెలంగాణ తొలి,మలి దశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను అవమానపరిచిన కేసీఆర్( KCR ) తెలంగాణ జాతిపిత ఎట్లయితడని,ముమ్మాటికి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తీర్పు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్( Professor Jayashankar ) అని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనంజయ నాయుడు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహాలు, ప్రణాళికలు,రూపొందించి రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసి, రాష్ట్ర సాధనలో తన యొక్క జీవితాన్ని అర్పించిన మహనీయుడు, విద్యావేత్త ప్రొఫెసర్ జయశంకర్ అని తేల్చి చెప్పారు.

తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జయశంకర్ తెలుగు,హిందీ,ఉర్దూ, ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సంపాదించి,ఆర్థికశాస్త్రం లో పిహెచ్డీ పట్టా పొంది ప్రిన్సిపాల్ గా,రిజిస్టర్ గా పనిచేసి,కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ లాంటి ఉన్నత పదవులను అధిరోహించారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం తన ఆస్తిని,తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ అని,1969 తెలంగాణ ఉద్యమంలో, అంతకుముందు జరిగిన నాన్ ముల్కి,సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమాల్లో పాల్గొన్నారని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ కి ముఖ్య సలహాదారుగా, మార్గదర్శకులుగా పనిచేశారని,తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా 1954లో ఫజల్ అలీ ఖాన్ కి నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు.

తెలంగాణ( Telangana )లో కాకుండా దేశవిదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారన్నారు.

ఆప్తో ఏకే కోయిస్సే ఓ తెలంగాణ దేఖ్ నా ఔర్ మర్జాన అని అనేవారని తెలంగాణ ఉద్యమాన్ని( Telangana Movement ) గల్లీ నుండి ఢిల్లీ దాకా ఢిల్లీ నుండి అమెరికా దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు.

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల అసమానతల పట్ల తీవ్ర పోరాటం చేశారని, ఉద్యమం గురించి ఎవరు మాట్లాడని రోజుల్లో 1954 లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను ఎండగట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్ఆర్సి కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి,మా తెలంగాణ మాకు కావాలని నినదించిన పోరాట యోధుడని,అలాంటి మేధావిని జాతిపిత కాదని,నేనే జాతిపితనని దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పే రీతిలో తెలంగాణ యావత్ సమాజం దీనిపై స్పందించవలసిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ జాతిపితగా జయశంకర్ ను ప్రకటించేంతవరకు ఉద్యమాన్ని ఉదృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనీ, తెలంగాణలోని సబ్బండ ప్రజల అభీష్టం మేరకు వెంటనే జయశంకర్ సార్ ను రాష్ట్ర పితగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

టాలీవుడ్ స్థాయిని ఎన్నో మెట్లు ఎక్కించిన కల్కి.. ఇతర ఇండస్ట్రీలకు సైతం షాకిచ్చారుగా!