జమైకా చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ .. ఘనస్వాగతం పలికిన ఇండియన్ కమ్యూనిటీ

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జమైకా చేరుకున్నారు.దీనిలో భాగంగా న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం కింగ్‌స్టన్‌లోని మ్యాన్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జమైకా అధికారులు, ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు.

జమైకాలో ఒక భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి.రామ్‌నాథ్ వెంటన ఆయన సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి కోవింద్, కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి, లోక్‌సభ ఎంపీ రమాదేవి, సతీష్ కుమార్ గౌతమ్, సెక్రటరీ స్థాయి అధికారులు వున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గార్డ్ ఆఫ్ హానర్, 21 గన్ సెల్యూట్ సమర్పించారు జమైకా ఆర్మీ అధికారులు.

భారత రాష్ట్రపతి వెంట జమైకా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వున్నారు.జమైకాలోని భారత హై కమీషనర్ మసాకుయ్ రంగ్‌సంగ్, ఆయన సతీమణి జింగ్ చార్వాన్ రంగ్‌సంగ్ కూడా రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

అనంతరం ఎయిర్‌పోర్ట్ నుంచి న్యూ కింగ్‌స్టన్‌లోని పెగాసస్ హోటల్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేరుకోగానే స్థానిక జమైకన్లు, ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు.

"""/"/ జమైకా పర్యటనలో భాగంగా పలు అధికారిక కార్యక్రమాల్లో రామ్‌నాథ్ పాల్గొంటారు.జమైకా గవర్నర్ జనరల్ సర్ పాట్రిక్ అలెన్, ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్‌నెస్‌లతో సమావేశమై పీఎం హౌస్‌ను సందర్శిస్తారు.

పీఎం హౌస్‌లో ఇరు దేశాల మధ్య ఎంవోయూ కూడా జరగనుంది.రేపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో నిర్మించిన అంబేద్కర్ అవెన్యూ రహదారిని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.

అలాగే జమైకా- ఇండియా ఫ్రెండ్‌షిప్ గార్డెన్‌ను కూడా ఆయన ప్రారంభిస్తారు.సాయంత్రం జమైకాలోని ఔత్సాహిక క్రికెటర్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్రికెట్ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నారు.

రాష్ట్రపతి భవన్ చరిత్రలో అరుదైన వివాహం