రేపే పోలింగ్‌… రాష్ట్రమంతా అమల్లోకి వచ్చిన 144 సెక్షన్‌

నల్లగొండ జిల్లా:పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు.

రాష్ట్రంలో మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసినందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం చేయొద్దని సూచించారు.

సోషల్‌మీడియాలో కూడా ఎన్నికల ప్రచారం కుదరదని స్పష్టంచేశారు.నియోజకవర్గంలో ఓటుహక్కు లేని స్థానికేతరులు వెంటనే నియోజకవర్గాలను విడిచి వెళ్లాలని స్పష్టంచేశారు.

రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం నుంచే 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చిందని,ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమికూడవద్దని సూచించారు.

మంగళవారం ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంల మూడో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను మంగళవారం రాత్రి కల్లా ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేస్తామని చెప్పారు.

ప్రజలను ప్రలోభ పెట్టేవాటిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్‌రూం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌తో పాటు అక్కడే ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో బుధవారం కూడా ఓటుహక్కు వినియోగించుకోవచ్చునని తెలిపారు.

బుధవారం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేస్తామని అక్కడి నుంచి పోలింగ్‌ కేంద్రాలకు వాహనాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఈ వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా సూచించిన మార్గంలో కాకుండా వేరే దారిలో వెళ్లకూడదని స్పష్టం చేశారు.

టీ తాగేందుకు, లేదా ఇతర అవసరాలకు కూడా వాహనాలను నిలపవద్దని ఆదేశించారు.మాక్‌ పోలింగ్‌ను నిర్వహించడానికి గురువారం ఉదయం 5.

30 గంటల కల్లా అభ్యర్థుల ఏజెంట్లు రావాలని సూచించారు.గుర్తులు, పేర్లు ఉన్న ఓటరు స్లిప్పులకు నో ఓటరు స్లిప్పులను గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోబోమని,ఓటరు కార్డు లేదా ఇతర 12 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకొనిరావాలని వికాస్‌రాజ్‌ సూచించారు.

రాజకీయ పార్టీలు ఇచ్చే ఓటరు స్లిప్పుపై అభ్యర్థి పేరు,గుర్తు,పార్టీ పేరు ఏవీ ఉండకూడదని, తెల్లకాగితంపై ముద్రించిన వాటిని మాత్రమే పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టంచేశారు.

ఈవీఎంల దగ్గరికి పోలింగ్‌ ఏజెంట్లు వెళ్లవద్దని,ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలోకి ఫోన్‌ తీసుకొనిరావద్దని సూచించారు.

ఓటింగ్‌ రహస్యంగా వేయాల్సి ఉంటుందని,ఓటును ఫొటో తీయడానికి కూడా వీలులేదని తెలిపారు.హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నవారిలో 94% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు.

రాష్ట్రంలో 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఇందులో 27,094 కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ చేయనున్నట్టు వికాస్‌రాజ్‌ వెల్లడించారు.

ఒకేచోట ఎక్కువ సంఖ్యలో కేంద్రాలు ఉన్న 7,571 చోట్ల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

12 వేల కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని పేర్కొన్నారు.రాష్ట్రంలోని పోలింగ్‌ కేంద్రాలను 3,806 సెక్టార్‌లుగా విభజించామని,పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోయినా, ఇతర సమస్యలున్నా సెక్టార్‌ అధికారులు పరిష్కరిస్తారని చెప్పారు.

ఇప్పటివరకు రూ.737 కోట్ల విలువైన నగదు, వస్తువులు,మద్యాన్ని సీజ్‌ చేశామని వికాస్‌రాజ్‌ వెల్లడించారు.

ఇందులో రూ.302 కోట్ల నగదు, రూ.

125 కోట్ల విలువైన మద్యం,రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌,రూ.

186 కోట్ల విలువైన మెటల్స్‌, రూ.84 కోట్లు విలువైన ఉచిత బహుమతులను సీజ్‌ చేశామని వివరించారు.

సమావేశంలో అడిషనల్‌ సీఈవో లోకేశ్‌కుమార్‌,జాయింట్‌ సీఈవో సర్ఫరాజ్‌ అహ్మద్‌, డిప్యూటీ సీఈవో సత్యవాణి పాల్గొన్నారు.

ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా గురువారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది.ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

పోలింగ్‌ కేంద్రాలున్న విద్యాసంస్థలకు బుధ, గురువారాల్లో సెలవు ఇచ్చారు.ఎన్నికల విధుల్లో ఉన్న విద్యాశాఖ సిబ్బందికి బుధ,గురువారాల్లో సెలవుతోపాటు డిసెంబర్‌ 1న స్పెషల్‌ క్యాజువల్‌ లీవుగా ప్రకటించారు.

వీడియో వైర‌ల్.. రోహిత్ భాయ్ ఆర్సీబీకి వ‌చ్చేయ్.. ఔనా అంటూ