ప్రణాళికాబద్ధంగా పోలింగ్ కు సన్నద్దం కావాలి…… రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ( Parliamentary Election Polling)సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.

బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్( Vikas Raj), ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్క్రూటీని, బ్యాలెట్ పేపర్ ముద్రణ, హోం ఓటింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ తదితర అంశాల పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ వీసీలో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి ఏప్రిల్ 26వ తేదీ నాటికి ఓటరు తుది జాబితా రూపొందించాలని, ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్పు పంపిణీ కోసం నిర్దేశిత షెడ్యూల్ రూపొందించి బూత్ స్థాయి అధికారుల ద్వారా ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్పు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, వేసవి కాలంలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్ లైన్ల వద్ద నీడ కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, జిల్లాలో వెబ్ క్యాస్టింగ్ చేస్తున్న పోలింగ్ కేంద్రాల వివరాలు సమర్పించాలని, మిగిలిన పోలింగ్ కేంద్రాల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈవీఎం యంత్రాల పై బ్యాలెట్ పత్రాల కమిషనింగ్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఫారం 12డీ కింద ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న అత్యవసర విధుల నిర్వహణ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలన్నారు.

ఇంటి వద్ద నుంచి దివ్యాంగులు సీనియర్ సిటిజన్ల ఓట్ల స్వీకరణకు అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేయాలని, పక్కా షెడ్యూల్ రూపోందించి, ఇంటి వద్ద ఓటింగ్ దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని అన్నారు.

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నమోదుకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటు చేయాలని, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ సిద్దం చేయాలని సూచించారు.

13న పకడ్బందీగా పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.పోలింగ్ విధులలో పాల్గొని సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

మే 13న ఉదయం మాక్ పోల్ నిర్వహించాలని, ప్రతి రెండు గంటలకు పోలీంగ్ వివరాలను ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని, పోలింగ్ ప్రక్రియలో ఈవీఎం యంత్రాలు ఇబ్బందులకు గురైతే వెంటనే రిజర్వ్ ఈవిఎం యంత్రాలను సెక్టార్ అధికారులు మార్చే విధంగా సన్నద్ధంగా ఉండాలని అన్నారు.

పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి అవసరమైన నివేదికలు పకడ్బందీగా నమోదుచేసి అందించేలా జాగ్రత్తలు వహించాలని, పోలింగ్ శాతంపై 3 గంటలకు, 5 గంటలకు అందించే నివేదికలు పక్కాగా ఉండాలని, ఎక్కడ ఎటువంటి అనుమానాలకు దారి తీసే విధంగా అధికారుల వ్యవహారం ఉండవద్దని అన్నారు.

ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు రమేష్, రాజేశ్వర్, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, సీపిఓ శ్రీనివాసాచారి, కలెక్టరేట్ ఏఓ రాంరెడ్డి సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రేమకు వ్యతిరేకం కాదు.. అలాంటి వ్యక్తికే ఛాన్స్.. నిత్యామీనన్ కామెంట్స్ వైరల్!