బడ్డీ కోట్లు తొలగించవద్దని చిరు వ్యాపారుల విన్నపం

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని మండపం ఏరియాలో బడ్డీ కోట్లను తొలగించి తమను రోడ్డున పడేయవద్దంటూ పలువురు చిరు వ్యాపారులు బడ్డీ కోట్ల సంఘం నాయకులు మంగళవారం కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవిని కలిసి వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు షేక్ నయీమ్,బొలిశెట్టి కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో మున్సిపాలిటీకి పన్ను చెల్లిస్తూ గత 50 సంవత్సరాల నుండి బడ్డీ కోట్లు వేసుకొని పేదలు ఉపాధి పొందుతున్నారని,ఇప్పటికిప్పుడు వారిని ఖాళీ చేయిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో అనేకమంది ఈ విలువైన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేసి,ఇది ప్రభుత్వ భూమి కాదని,వక్ఫ్ బోర్డ్ భూమి అని, లీజుకు తీసుకున్నామని,మీరు ఖాళీ చేయాలంటూ వస్తే వారిపై ధర్నాలు,పోరాటాలు చేసి ఇంతకాలం ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చామని గుర్తు చేశారు.

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలందరి పట్ల దయవుంచి మినీ షాపులను నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు పాండురంగారావు, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి,ఎండి మహమ్మద్,షేక్ దస్తగిరి, వేణుగోపాలరావు,జాఫర్, అబ్దుల్ రహీం,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

బాబాయ్ కి కోపం వస్తే అలా పిలుస్తారు…ఆ గిఫ్ట్ అలానే ఉంది: నిహారిక