వీధి కుక్కల దండయాత్ర…!

నల్లగొండ జిల్లా: విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాలు నల్లగొండ జిల్లా త్రిపురారం మండల వ్యాప్తంగా 32 గ్రామాలు ఉండగా,ప్రతి గ్రామంలో సుమారు 100 నుంచి 300 వరకు స్వైర విహారం చేస్తూ మనుషులను, మూగ జీవాలను వెంటపడి తరిమి మరీ దాడికి దిగుతున్నాయి.

ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా తిరుగుతూ పిల్లల,పెద్దల,వాహనాలపై శత్రువు వలే దండయాత్ర చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.

ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్‌ నెల వరకు ఆయా పీహెచ్‌సీలలో కుక్కకాటుకు గురైన బాధితుల సంఖ్య బాగా పెరిగడంతో వీధి కుక్కల భయంతో జనం బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

పలు గ్రామాల్లో వీధి దీపాలు సరిగ్గా లేక గుంపులుగా సేద తీరుతూ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి.

దీనితో రాత్రిళ్లు ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది.ఇలా రోజుకో చోట కుక్కకాటుకు బలైపోతున్నారు.

రోడ్డుపై వాహనాలకు అడ్డురావడంతో అనేక ప్రమాదాలు జరిగి మనుషుల కాళ్ళు, చేతులు విరిగి,ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండల వ్యాప్తంగా కుక్కల దాడిలో జనవరి నుంచి ఆగష్టు వరకు అనేక మూగ జీవాలను గాయపర్చి చంపాయని,గతవారం రోజుల వ్యవధిలో 6 పాడి గేదెలు,4 లేగ దూడలు, 50 కోళ్ళు కుక్కల దాడిలో మృత్యువాత పడడడంతో వాటిపై ఆధారపడిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.

కుక్కలను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కుక్కల సంఖ్య పెరగకుండా పీహెచ్‌సీ పరిధిలో జంతు సంతాన నిరోధక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శిస్తున్నారు.

గ్రామ పంచాయతి పాలక మండలి వారికి ఎన్నిసార్లు విన్నవించినా పెడ చెవిన పెట్టడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.

ఆరోగ్యానికి అమృతం సోయా పాలు.. దాని లాభాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు!