సూర్యాపేట జిల్లా:ఆసరా పింఛన్లను ప్రతినెల రెగ్యులర్ గా ఇవ్వాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో నిర్వహించిన ఐద్వా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి నెల మొదటి వారంలో పింఛన్ దారులకు పింఛన్ ఇవ్వాల్సి ఉండగా దానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించటం సరికాదన్నారు.
మార్చి నెలలో లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వాల్సి ఉండగా ఏప్రిల్ లో ఇచ్చారని,ఏప్రిల్ 27వ తేదీ వచ్చిన నేటికి పింఛన్లు సకాలంలో రాకపోవడంతో వితంతువులు,వికలాంగులు,వృద్ధులు,చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్ల కోసం ఆసరా పింఛన్ దారులు పోస్ట్ ఆఫీసుల చుట్టూ,గ్రామ పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి పింఛన్ ఇస్తామని చెప్పి,వారి నుండి దరఖాస్తులు స్వీకరించి సంవత్సరాలు అవుతున్నా నేటికీ వారికి పింఛను ఇవ్వలేదని విమర్శించారు.
గత 7 సంవత్సరాల నుండి కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో వృద్ధులు,
వితంతువులు,వికలాంగులు చేతి వృత్తిదారులు,తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ప్రభుత్వం తక్షణమే అన్ని రకాల పింఛన్లు మంజూరు చేసి,ప్రతి నెల 5వ తారీఖున చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి,మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు తీసుకుంటున్నారని,పేదల దగ్గరకు రాగానే ఆర్థిక లోటు పేరుతో నెలల కొద్దీ పింఛన్లు చెల్లించకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
తక్షణమే ప్రభుత్వం ఆసరా పించన్ దారులకు పింఛన్లు ఇవ్వాలని లేనియెడల ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ,రాష్ట్ర కమిటీ సభ్యురాలు మద్దెల జ్యోతి, జిల్లా నాయకురాలు జూలకంటి విజయలక్ష్మి,అండం నారాయణమ్మ,సురభి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించిన రాజమౌళి… తారక్ నటన మరో లెవెల్ అంటూ!