ఎన్నికల కోడ్ ఉన్నా యధేచ్చగా బెల్ట్ షాపుల నిర్వహణ
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:లోక్ సభ ఎన్నికల( Lok Sabha Elections ) నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
కానీ,సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లోఎన్నికల కోడ్ అమల్లో ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది.
నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైన్స్ షాపుల నుండి గ్రామాల్లోని బెల్ట్ షాపులకు ఆటో, బైకుల ద్వారా యధేచ్చగా మద్యం సరఫరా చేస్తూ మారుమూల ప్రాంతాల్లో కూడా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.
అన్నివిషయాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమలు చేస్తున్న అధికారులు మద్యం విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ లోపాయికారంగా వైన్స్ యాజమాన్యానికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిరంతరం నిఘా ఉన్నప్పటికీ ఎక్సైజ్,పోలీస్ శాఖల అధికారులు ఎన్నికల డ్యూటీలో గస్తీ కాస్తున్నా ఇంత ఈజీగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా ఎలా అవుతుందని?24×7 బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.
గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి కిరాణా షాపు ఒక బెల్ట్ షాపుగా మారి ఎమ్మార్పీ ధరలకు మార్కెట్లో దొరకాల్సిన మద్యాన్ని రూ.
30 నుండి రూ.60 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నా ఎవరూ నోరు మెదపకుండా చోద్యం చూస్తూ ఉండిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి అడపాదడపా ఒకటి రెండు కేసులు నమోదు చేస్తున్నారని,కానీ,అందరికీ తెలిసే అధికారికంగా బెల్ట్ దందా జోరుగా నడుస్తుందని మద్యం ప్రియులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
తుంగతుర్తి ( Thungathurthy )ఎక్సైజ్ శాఖ పరిధిలోని అన్ని మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుంది.
బెల్ట్ షాపుల దందాను అరికట్టాల్సిన ఎక్సైజ్ పోలీసులు వైన్స్ యాజమాన్యం ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల కోడ్ పుణ్యమా అని గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ దందా లాభసాటిగా ఉండడంతో గతంలో కేవలం కిరాణా షాపులు మాత్రమే నిర్వహించే వారు కూడా నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లోని కిరాణా షాపుల్లో శీతల పానీయాలకు తోడుగా,కొత్తగా బెల్ట్ దందా షురూ చేయడం గమనార్హం.
గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపులో బ్రాండెడ్ మద్యం తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు ఎంతైనా దొరుకుతుందంటే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.
అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపుల( Belt Shops ) దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నా చర్యలు మాత్రం సున్నా అని అంటున్నారు.
ఇళ్ల మధ్యలోనే బెల్ట్ దందా కొనసాగడంతో మహిళలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోక పోవడంతో అధికారుల అండదండలతో కొనసాగుతున్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట.
దీనితో అసలు ఇక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉందా లేదా అనేది అర్దం కావడం లేదని సామాన్యులు సైతం వాపోతున్నారు.
ఇదే అదునుగా భావించిన రాజకీయ నాయకులు మద్యం మత్తులో ప్రజలను మభ్యపెట్టి ఓట్లకు గాలం వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికలు సజావుగా జరగాలంటే బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలను కట్టడి చేయాలని కోరుతున్నారు.
హ్యాపీగా రిటైర్ అవుతా…. అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన రష్మిక!