పల్లె ప్రకృతి వనం కబ్జాకు గురైనా పట్టని అధికారులు…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి చెట్లను పెంచితే, అధికారుల,ప్రజా ప్రతినిధుల అండతో కొందరు ఏపుగా పెరిగిన ఆ చెట్లను నరికి ఆ స్థలంలో ఇళ్ళ ప్లాట్లు చేసి ఏకంగా పల్లె ప్రకృతి వనాన్నే కబ్జా చేసిన ఘటన నల్లగొండ జిల్లా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్)
మండలం( Thirumalagiri ) తిరుమలగిరి గ్రామంలో 765 సర్వే నెంబర్ లో 20 గుంటల భూమిని గ్రామ పంచాయతీకి కేటాయించారు.
అక్కడ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు.ఈ భూమితో పాటు పక్కనే ఉన్న 771 సర్వే నెంబర్ లో 1.
10 గుంటల భూమికి 2021 లోనే గ్రామపంచాయతీ వారు జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.
అయితే 771 సర్వే నెంబర్ లోని అసైన్డ్ భూమిలో 0.18 గుంటల భూమిని రెవిన్యూ లే అవుట్ ప్రకారం జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున పంపిణీ చేశారు.
కంచె వేసిన 771 సర్వే నెంబర్ భూమిలో కూడా కొంతమేరకు ఉపాధి హామీ పథకంలో చెట్లను నాటించారు.
ఆ చెట్లు ఇప్పుడు ఏపుగా పెరిగాయి.కానీ,గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల కన్ను పల్లె ప్రకృతి వనంపై పడింది.
దీనితో వారు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కుమ్మక్కై పల్లె ప్రకృతి వనం( Palle Prakruthi Vanam )లో ఏపుగా పెరిగిన చెట్లను నరికి ఆ స్థలంలో ఫ్లాట్లు ఏర్పాటు చేశారు.
ఇందులో మండల తహసిల్దార్ కార్యాలయ అధికారి,ఓ ప్రజాప్రతినిధి అనుచరుల అండతోనే పల్లె ప్రకృతి వనాన్ని కూల్చి,కంచెను తొలగించి అందులో దర్జాగా ఫ్లాట్లు ఏర్పాటు చేశారని,ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ తెరవెనక తతంగం నడిపించినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
పల్లె ప్రకృతి వనంలో అసలు చెట్లు నరికిందెవరు.?తిరుమలగిరి గ్రామంలోపల్లె ప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన సుమారు 700 చెట్లను నరికినా ఎవ్వరికీ పట్టింపు లేదా అంటే లేదనే చెప్పాలి.
ఎందుకంటే పల్లె ప్రకృతి వనం కబ్జాకు గురైందని అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా,ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు,రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ ఆ వైపు కన్నెత్తి చూడక పోవడమే దీనికి నిదర్శనం అంటున్నారు.
బహిరంగంగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా వెలుగులోకి తేవాల్సిన కలానికి ఇళ్ళ ప్లాట్ల రూపంలో సంకెళ్లు పడ్డాయని,
ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు,ప్రశ్నించే కలం ఏకమైతే ఇక ఎదిరించే వారు ఉండరని ధైర్యంతో ఇంతకు తెగించారని, గుంతలు గుట్టలుగా ఉన్న భూమిని చదును చేసి ఫ్లాట్లుగా ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం కూడా వారే అందించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈనేపథ్యంలో మండల తహసీల్దార్ హుటాహుటిన B/278/2023 రెవిన్యూ పైలు తయారు చేసి చాటు మాటునా కొందరికి పట్టాల పంపిణీ చేశారని తెలుస్తోంది.
అధికారుల చర్యలు ఏమయ్యాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana State Govt ) పర్యావరణ పరిరక్షణ కోసం కోట్ల రూపాయలను వెచ్చించి హరితహారం పథకంలో మొక్కల పెంపుదలతో పాటు ప్రతి పల్లెల్లో ఆహ్లాదాన్ని కల్పించుటకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తుంటే, కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో కొంతమంది వ్యక్తులు పల్లె ప్రకృతి వనంలో చెట్లను నరికి వేసిన సంఘటన మండల అధికారులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వెళ్ళారు.
బాధ్యులపై చర్యలు మాత్రం మరిచారు.పల్లె ప్రకృతి వనం కబ్జాకు గురైనా జిల్లా అధికార యంత్రాంగం నేటికీ పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు.
పల్లె ప్రకృతి వనంలో ఫ్లాట్లు చేశారని ఆరోపణలు రావడంతో మండల రెవెన్యూ గిర్దావర్, సర్వేయర్లు,ఎంపీడీవో ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ అధికారులు, పంచాయతీ సెక్రటరీ,గ్రామ సర్పంచ్ సంఘటన స్థలానికి చేరుకొని పల్లె ప్రకృతి వనంలో ఎంత మేరకు భూమి కబ్జాకు గురి అయిందో,జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేసిన చెట్లను ఎన్ని నరికి వేశారో వివరాలు సేకరించారు.
కానీ,నిజానిజాలు ఏమిటో ఇంత వరకు తెల్చానే లేదని అంటున్నారు.పల్లె ప్రకృతి వనంలో 1291 చెట్లు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నాటగా సుమారు 700 పైన చెట్లు కనిపించడం లేదని,కబ్జాకు గురైన భూమిని స్వాధీన పరచుకోకుండా దాటవేసే ధోరణిని అధికారులు అవలంభిస్తున్నారనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.
ఆ ప్రదేశంలో రెవిన్యూ లేఔట్ ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారంగా ఫ్లాట్లు ఏర్పాటు చేశారని, ఫీల్డ్ మీదికి వెళ్లిన అధికారులు బాధ్యులపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదని,దీంతో అధికారుల కనుసనల్లోనే ఈ వ్యవహారం నడిచినట్టు ఆరోపిస్తున్నారు.
స్థానికంగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారే తప్ప చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని, ఇప్పటికే గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఎమ్మార్వో 13 మందికి పట్టాలు చాటుమాటున అందించారని, పైకి మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడి,లోలోపల పని పూర్తి చేశారని చెబుతున్నారు.
మండలంలో ఏ ఒక్కరికి తెలియకుండా డ్రా పద్ధతిన ఫ్లాట్లు పంచుకున్నారని, జర్నలిస్టులకు కేటాయించిన భూమిపై ఆరోపణలు రావడంతో అధికారులు ఫీల్డ్ మీదికి వెళ్లి జరిగిన నష్టాన్ని చూశారని,కానీ,చర్యలు మాత్రం తీసుకోకపోవడం ఏమిటో వారికే తెలియాలని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతున్నారు.
సంక్రాంతికి లో బడ్జెట్ సినిమాలే హిట్.. హనుమాన్, సంక్రాంతికి వస్తున్నాం ప్రూవ్ చేసిందిదే!