20 ఏళ్లుగా అలరిస్తోన్న నువ్వు నాకు నచ్చావ్.. అయినా బోర్ కొట్టదంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్‌లో ఫ్యామిలీ కంటెంట్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ లభిస్తూ ఉంటుంది.ఈ కోవలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయి బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నాయి.

అయితే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఏళ్ల తరబడి అలరిస్తూ వస్తున్నాయి.ఈ జాబితాలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం ప్రేక్షకులను గత 20 ఏళ్లుగా అలరిస్తూ వస్తోంది.

విక్టరీ వెంకటేష్ నటించిన ఈ కుటుంబ కథా చిత్రం వెండితెర ప్రేక్షకులతో పాటు బుల్లితెర ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంది.

తెలుగు ప్రేక్షకులను అలరించే అంశాలు పుష్కలంగా ఉన్న సినిమాగా ‘నువ్వు నాకు నచ్చావ్’ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన కథ, మాటలు ఈ సినిమాను సాధారణ ప్రేక్షకుడికి మరింత దగ్గరయ్యింది.

ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తూనే పండించిన కామెడీ ప్రేక్షకులను కట్టిపడేసింది.ఓ స్టార్ హీరో సైతం తనపై తాను కామెడీ చేయడం ఆ రోజుల్లో విశేషమని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం, సునీల్ కామెడీ ఈరోజుకీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంది.

కొన్ని సీన్స్‌లో వీరిద్దరు చేసే కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.కాగా ఈ సినిమాకు కోటి అందించిన సంగీతం సినిమాకు అదిరిపోయే బలాన్ని ఇచ్చిందని చెప్పాలి.

సాధారణమైన కథతో అసాధారణమైన విజయాన్ని అందుకోవచ్చని ‘నువ్వు నాకు నచ్చావ్’ నిరూపించింది.ఈ సినిమాతో కామెడీ జోనర్ చిత్రాలకు ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేశారు చిత్ర యూనిట్.

మొత్తానికి ఈ సినిమా కేవలం కామెడీతోనే కాకుండా ఎమోషన్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా కామెడీ సీన్స్‌ను పలు పేజీలు మీమ్స్‌గా వాడుకుని ఇప్పటికీ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాన్ని ప్రేక్షకులను దగ్గర చేశారు.

ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.