గత నాలుగు నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలను టెన్షన్ పెడుతోంది.
భారత్ లో ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు వైరస్ పేరు వింటేనే ప్రజలు భయాందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి.
పలు వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలు ఇస్తున్నా పూర్తిస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది.
ఇలాంటి సమయంలో కరోనా వచ్చి మంచే చేసిందని నిపుణులు చెబుతూ ఉండటం గమనార్హం.
కరోనా మహమ్మారి వల్ల ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది.గతంలో జంక్ ఫుడ్, పాస్ట్ ఫుడ్ పై ఆసక్తి చూపించిన ప్రజలు నేడు వాటికి దూరంగా ఉంటున్నారు.
వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్న వంటకాలు తినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.అదే సమయంలో కూల్ డ్రింక్స్ ను మానేసి పండ్ల రసాలు, సలాడ్ లు లాంటి వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు.
గతంలో ఆన్ లైన్ ఫుడ్ వైపు మొగ్గు చూపిన జనం ప్రస్తుతం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంపై ఇష్టం చూపుతున్నారు.
ఒక ప్రముఖ సంస్థ తాజాగా కరోనాకు ముందు కరోనా విజృంభించిన తరువాత ప్రజల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల గురించి సర్వే నిర్వహించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
శొంఠి, యాలకులు, లవంగాలతో కషాయాలు చేసుకుని తాగే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని పిస్తా, బాదం, కోడిగుడ్లు, నిమ్మకాయలు, డ్రై ఫ్రూట్స్ ను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని సర్వేలో తేలింది.
ఒకప్పుడు రుచికే ప్రాధాన్యత ఇచ్చిన ప్రజలు ప్రస్తుతం ఆరోగ్యానికే అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉండటం గమనార్హం.