దోపిడి దొంగల బీభత్సం: చోరీకి అడ్డొచ్చిన ఎన్ఆర్ఐపై దాడి.. డబ్బు, నగదు అపహరణ
TeluguStop.com
ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులకు మాతృదేశం పట్ల ప్రేమ ఏమాత్రం తగ్గదు.
ఎంత బిజీగా వున్నా భారత్‌లోని పరిస్ధితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వుంటారు.అంతేకాదు.
వీలు కుదిరినప్పుడల్లా భారతదేశానికి వస్తూ వుంటారు.ఇలా ఇక్కడకు వచ్చిన కొందరు ప్రవాసులకు మనదేశంలో విచిత్ర పరిస్ధితులు ఎదురవుతున్నాయి.
తాజాగా పంజాబ్‌లోని జలంధర్‌లో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు.స్థానిక మోడల్ టౌన్ సమీపంలో ఒక జంటను తుపాకీతో బెదిరించి వారి హ్యుందాయ్ క్రెటా కారును అపహరించుకుపోయారు.
ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులు గడవకుండానే శుక్రవారం అర్థరాత్రి లాధేవాలి ప్రాంతంలోని రంధావా కాలనీలో దొంగలు ఓ ఎన్ఆర్ఐ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కొందరు గుర్తు తెలియని సాయుధులైన దొంగలు ఒక ఎన్ఆర్ఐపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
తర్వాత అతని ఇంట్లో నుంచి నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు.బాధితుడిని మల్కిత్ సింగ్‌గా గుర్తించారు.
ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్ధితి విషమంగా వుండటంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు.దుండగులు తమ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు తామంతా గాఢ నిద్రలో వున్నట్లు బాధితుడి భార్య హర్బన్స్ కౌర్ చెప్పారు.
ప్రధాన ద్వారానికి తాళం వేసి వున్నప్పటికీ వారు ఇంట్లోకి ఎలా ప్రవేశించారో తెలియడం లేదని ఆమె అన్నారు.
తన భర్తపై దుండగులు కాల్పులు జరపడంతో .ఆయన వారితో పోరాడేందుకు ప్రయత్నించారని హర్బన్స్ కౌర్తెలిపారు.
అయితే వారు పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి .లక్షలాది రూపాయల నగదు, బంగారు ఎత్తుకెళ్లారని వాపోయారు.
దుండగులు ఇంటి నుంచి బయటకు పారిపోయిన వెంటనే.తాను సహాయం కోసం కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తన భర్తను ఆసుపత్రికి తరలించారని హర్బన్స్ కౌర్ చెప్పారు.
నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.అక్రమార్కులకు పోలీసులంటే భయం లేకుండా పోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.