టిక్కెట్ రాకుంటే పార్టీ మారే వ్యక్తిని కాదు: అద్దంకి దయాకర్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి టిక్కెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ అధిష్టానం రిక్త హస్తం ఇచ్చి, గురువారం రాత్రి మాజీ గిడ్డంగుల చైర్మన్ మందుల సామ్యేల్ ను తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఖరారు చేసింది.
దీనితో అద్దంకి పార్టీ మారుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయని భావించిన అద్దంకి అదే సోషల్ మీడియా వేదికగా గురువారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు.
అందులో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించిందని,అధిష్టానం నాకు గతంలో రెండుసార్లు తుంగతుర్తిలో టికెట్ ఇచ్చిందని,
ఈ సారి వేరే వారికి ఇచ్చింది అంతే,టిక్కెట్ రానంత మాత్రాన పార్టీ మారే వ్యక్తిని కానని స్పష్టం చేశారు.
తుంగతుర్తిలో నాకంటే సామ్యేల్ బలమైన అభ్యర్థి అని సర్వేల్లో తేలి ఉంటదని, అందుకే కాంగ్రెస్ అధిష్టానం సామేల్ టికెట్ ఇచ్చిందన్నారు.
అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని,సామేల్ గెలుపు కోసం కృషిచేస్తానని ప్రకటించారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాకు ఏవైనా మంచి అవకాశాలు ఇస్తారనే నమ్మకం నాకుందని, జీవిత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ కోసమే పనిచేస్తానని తేల్చి చెప్పారు.
మయన్మార్‌లో సంస్కృతంలో బోధన .. రాజస్థాన్ ఎన్ఆర్ఐకి ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’