మధ్యాహ్న భోజనమా…మరణ ఆహారమా…?
TeluguStop.com
నల్లగొండ జిల్లా:ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్ట పరిచేందుకు పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్పా ఆచరణలో పూర్తిగా విఫలం అవుతున్నాయని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నపిల్లలకు పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం.
ఈ ప్రభుత్వ పాఠశాలలో పేద,మధ్య తరగతికి చెందిన 35 మంది పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు.
వీరికి ప్రభుత్వం పౌష్టికాహారం పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది.ఈ పాఠశాలలో నాణ్యతలేని భోజనంతో పాటు ఉప్పు కారం వేసి నీళ్లతో ఉడికీ ఉడకని టొమోటో,దోసకాయ కూర, పావు కిలో పప్పుతో 35 మందికి చేసిన నీళ్ళ సాంబారు వడ్డించారు.
ఆ భోజనాన్ని మనిషి అనే వారు ఎవరూ తినరు.అయినా పసి పిల్లలతో ఇలాంటి నాణ్యతలేని భోజనం తినిపిస్తూ ఉంటే ఫుడ్ ఫాయిజన్ కాకుండా ఎలా ఉంటుంది.
ఆ భోజనం కూర, సాంబారు తినలేక పిల్లలు నానా అవస్థలు పడుతున్న దృశ్యం ఎవరికైనా కళ్ళకు నీళ్ళు తెప్పిస్తుందంటే అతిశయోక్తి కాదు.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని పిల్లలను బెదిరించడం కొసమెరుపు.ఇదే విషయమై పాఠశాల ఉపాధ్యాయులను వివరణ కోరగా పావు కిలో పప్పుతో ఇంతకంటే ఇంకెలా చేస్తారు? చిక్కగా చేస్తే ఇంతమంది పిల్లలకు ఎలా సరిపోతుంది?అంటూ దురుసుగా సమాధానం ఇవ్వడం గమనార్హం.
ఇలాంటి భోజనం చేయడం వల్లనే ఎక్కువగా ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నాయని, అడిగేవాళ్లు లేక వారి ఇష్టారాజ్యంగా చేస్తూ,పిల్లలే కదా పెట్టిందే తింటారనే ధీమాతో వంటలు చేస్తూ పిల్లల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్15, ఆదివారం2024