సూచిక బోర్డులు లేక వాహనదారుల ఇకట్లు…!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda )లోని మర్రిగూడ- చండూరు ప్రధాన రహదారి పాము వంకర్లు తిరిగి డేంజర్ బెల్స్ మోగిస్తుంది.

ముఖ్యంగా సరంపేట గ్రామ సమీపంలో పెద్ద పెద్ద మూలమలుపులు ఉండడంతో వాహనదారులు,ప్రజలు నిత్యం పరేషాన్ అవుతున్నారు.

మూల మలుపుల దగ్గర ఎలాంటి సూచిక బోర్డులు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని,డేంజర్ జోన్లుగా మారిన రహదారి వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని,దీంతో రోడ్లపై ప్రయాణించేవారు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిరోజు చర్లగూడెం రిజర్వాయర్( Charla Gudem ) సంబంధించిన టిప్పర్లు ఇడికూడ చెరువు నుండి చర్లగూడెం రిజర్వాయర్లోకి నిరంతరం ఇదే రహదారి గుండా మట్టిని తరలిస్తూ ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

గతంలో సరంపేట ఆంజనేయ స్వామి గుడి మూలమలుపులో చాలా వాహనాలు అదుపు తప్పి చెట్టును,ఇల్లును ఢీకొట్టిన ఘటన ఉన్నాయని, ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో గండం గట్టెక్కిందని స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామీణ రహదారుల మూలమలుపులో సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

ట్రంప్ దెబ్బకి అమెరికాలో భారీగా పెరుగుతున్న సిజేరియన్లు.. భారతీయ తల్లులు పరుగులెందుకు?