ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన ఆర్ధిక మంత్రి

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికలలో హామీ ఇచ్చిన బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేసింది.

ఓ రెండేళ్ళు కాలయాపన చేసి తరువాత ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏదో ముష్టిలా కొంత సొమ్ము ఏపీకి విదిల్చిన బీజేపీ పార్టీ తరువాత అప్పటి అధికార పార్టీ టీడీపీతో కయ్యం పెట్టుకొని ఏపీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేదు.

ఇక తాజాగా జరిగిన ఎన్నికలలో వైసీపీ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చి తీరుతాం.

ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో స్నేహంగా ఉంటూనే పోరాటం చేస్తాం అంటూ కథలు చెప్పుకొచ్చింది.

కొద్ది రోజుల క్రితం జరిగిన నీతి అయోగ్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకత ఎంత అనేది చెప్పే ప్రయత్నం చేసాడు.

అయితే తాజాగా లోక్ సభలో ఆర్ధిక మంత్రి మరో సారి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పడం ద్వారా, ఇక ప్రత్యేక హోదా అంటూ పార్టీలు ప్రజలని మోసం చేయడం ఆపేయాలని పరోక్షంగా చెప్పేసింది.

ప్రత్యేక హోదా విషయమై సోమవారం లోక్‌సభలో బీహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, బీహార్‌, ఝార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయని ఆమె తెలిపారు.

ప్రణాళిక మద్దతు కోసమే జాతీయాభివృద్ధి మండలి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసిందన్నారు.

అయితే ప్రత్యేక హోదా ఎవరికి ఇచ్చే అవకాశమే లేదని, ఎవరు కూడా దీనిపై ఆశలు పెట్టుకోవద్దని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చింది.