ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు ! చక్రం తిప్పిన కేవీపీ ?

తెలంగాణలో కాస్తో కూస్తో బలంగా ఉన్నా,  ఏపీలో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగానే ఉంది.

ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం కాంగ్రెస్ కారణం అనే అభిప్రాయంతో ఆ పార్టీని ఏపీలో అంతా దూరం పెడుతూనే వస్తున్నారు.

అయితే ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించిన తరువాత , కాంగ్రెస్ బలహీనంగా ఉన్న అన్ని రాష్ట్రాలపైన ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అక్కడ నాయకుల వ్యవహార శైలి , పార్టీ మళ్ళీ బలం పుంజుకోవాలి అంటే ఏం చేయాలనే విషయం పైన ఆయన దృష్టి సారించారు .

ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమించడంతో పాటు,  కార్యనిర్వాహక అధ్యక్షులు నియామకం , అలాగే ప్రచార కమిటీలను ఆయన నియమించారు.

ఏపీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత గిడుగు రుద్దరాజు నియమితులయ్యారు.

ఇక ప్రచార కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ సీనియర్ నేత హర్ష కుమార్ నియమితులు కాగా,  కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా మాజీ కేంద్రమంత్రి పళ్ళం రాజు , మీడియా సామాజిక మాధ్యమాల కమిటీ చైర్మన్ గా తులసి రెడ్డి నియమితులయ్యారు.

18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ , 33 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు.

వీటిల్లో కోఆర్డినేషన్ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు స్థానం కల్పించారు.అయితే గిడుగు రుద్దరాజు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులు అవ్వడానికి,  పార్టీ కమిటీల విషయంలో సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావు చక్రం తిప్పినట్లు సమాచారం.

  """/"/ అయితే పార్టీ సీనియర్ నేతలు కెవిపి రామచంద్రరావు,  సుబ్బిరాం రెడ్డి పల్లంరాజు, గిడుగు రుద్దరాజు ఇలా మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి కీలక పదవులు, ప్రాధాన్యాలు దక్కాయి కానీ,  మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో కీలక పదవి దక్కుతుందని భావించిన కిరణ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీ తెలంగాణ విభజన సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నిర్ణయం పై ఆగ్రహం చెంది పార్టీకి పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీ పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు.

కానీ ఆ పార్టీ ప్రభావం ఏమి కనిపించకపోవడంతో , మళ్లీ కాంగ్రెస్ లో చేరారు కానీ పెద్దగా యాక్టివ్ గా అయితే ఆయన ఉండడం లేదు.

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఏపీలో పర్యటించిన సమయంలోను కిరణ్ కుమార్ రెడ్డి కనిపించకపోవడం, ఆయన ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తూ ఉండడంతో,  ఆయనను పక్కన పెట్టినట్లుగా అర్థమవుతుంది.

అయితే పార్టీ సీనియర్ నేత రాజశేఖర్ రెడ్డి హయాంలో చక్రం తిప్పిన కేవీపీకి కాంగ్రెస్ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఆయన సూచించిన వారికి పదవులు కట్టబెట్టినట్లు ఏపీ కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.

Jangaon ACP Damodar Reddy : జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు