సమిష్టి కృషితో నారాయణవనం బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి: జెఈవో వీరబ్రహ్మం సమీక్ష

నారాయణవనం లోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మే 13 నుండి 21వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను సమష్టి కృషితో విజయవంతం చేయాలని టీటీడీ జెఈవోశ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల నిర్వహణ పై అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, ఉత్సవాలలో 13వ తేదీ ధ్వజారోహణం, 17 వ తేదీ గరుడ వాహనం, 20వ తేదీ రథోత్సవం, మరియు కళ్యాణోత్సవం, 21వ తేదీ చక్రస్నానం ముఖ్యమైనవని అన్నారు.

రథం పరిస్థితి ఎలా ఉందో పరిశీలించి ట్రైల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు.వాహన సేవల కోసం అవసరమైన తండ్లు, ఘటాటోపం సిద్ధంచేసుకోవాలన్నారు.

అవసరమైన మేరకు స్కౌట్స్, శ్రీవారి సేవకులను సిద్ధం గా ఉంచుకోవాలని సూచించారు.పంచగవ్య ఉత్పత్తుల అమ్మకాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

భక్తులకు అన్న ప్రసాదాల వితరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఆలయానికి అవసరమైన ఇత్తడి పాత్రలు, పోటు కార్మికులను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ధర్మప్రచార పరిషత్ ద్వారా భజనలు, కోలాటాలు ఏర్పాటు చేయాలన్నారు.డిప్యూటి ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ దుర్గ రాజు, విజివో శ్రీ మనోహర్, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్, ఈఈ శ్రీ మనోహర్, విద్యుత్ విభాగం డిఈ శ్రీ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జెఈవో మాడవీధులను, ఇంజినీరింగ్ పనులను పరిశీలించారు.భక్తులకు ఇబ్బంది కలగకుండా చలువ పందిల్లు వేయాలని అధికారులను ఆదేశించారు.

తరువాత శ్రీ అవనాక్షమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

కేసీఆర్ యాత్రకు భద్రత కల్పించాలి.. సీఈవోకి బీఆర్ఎస్ విజ్ఞప్తి