కబ్జా అవుతున్న నందికొండ ఎన్ఎస్పీ భూములు…!

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎస్ఈ ఆఫీస్ ను ఆనుకొని వెనుక భాగంలోని ప్రభుత్వ స్థలాల్లో గత కొంతకాలంగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని,సంబంధిత అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండటంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ కబ్జారాయుళ్ళ వెనుక ఓ అవినీతి అధికారి,మరో ప్రజాప్రతినిధి ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.

వారి అండదండలతోనే ఎన్ఎస్పీ భూముల కబ్జా యధేచ్చగా సాగుతుందని అందరికీ తెలిసినా తెలియనట్టు నటిస్తూ భూములు కొల్లగొట్టే వారికి అంతర్గతంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం కళ్ళకు కనిపిస్తున్నా ఎన్ఎస్పీ, రెవిన్యూ,మున్సిపల్ శాఖల అధికారులు ఏమీ జరగనట్లే గమ్మున ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికార యంత్రాంగంలో కొందరు అవినీతి అధికారులు కబ్జాదారులు ఇచ్చే ప్రలోభాలకు అలవాటుపడి అక్రమాలను సక్రమం చేసే పనిలో ఉన్నారని,వీరికి స్థానిక రాజకీయ నేతల సపోర్ట్ కూడా ఉండడంతో చర్యలు తీసుకోవడానికి నిజాయితీ గల అధికారులు కూడా తటపటాయిస్తూ ఉన్నారని ప్రభుత్వ ఉద్యోగుల్లో సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనితో తమకు అడ్డూ అదుపూ లేదని కబ్జాదారులు రెచ్చిపోయి ప్రభుత్వ స్థలాలను అక్రమిస్తున్నరని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి కాపాడి,ప్రజావసరాలకు వినియోగించాలని కోరుతున్నారు.

తొలి సినిమాతోనే మోక్షజ్ఞకు ఊహించని సవాళ్లు.. వాటిని అధిగమించడం సులువు కాదుగా!