డిఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో వారం పాటు స్పెషల్ డ్రైవ్

నల్లగొండ: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి అధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తూ నల్లగొండ పోలీసులు హడలెత్తిస్తున్నారు.

శనివారం రాత్రి పట్టణ వన్ టౌన్,టూ టౌన్,రూరల్ పోలీసులు సంయుక్తంగా 14 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నాకాబందీ నిర్వహించి,సరియైన ఆధారాలు,నెంబర్ ప్లేట్లు లేని దాదాపు 80 వాహనాలు సీజ్ చేశారు.

అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే 100 మంది యువకులను అదుపులో తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో డ్రగ్స్, గాంజా, మద్యం లాంటి చెడు వ్యసనాల ద్వారా కలిగే నష్టాలను గురించి కౌన్సిలింగ్ నిర్వహించారు.

అనంతరం డిఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నామన్నారు.

వారం రోజులపాటు ఇదే తరహాగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామని,ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ బహిరంగ మద్యం సేవించే వారిపై, నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారని తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ అసాంఘిక కార్యక్రమాలను పాల్పడినట్లు కనిపిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఈ పోలీస్ స్పెషల్ డ్రైవ్ లో పట్టణ వన్ టౌన్ టూ టౌన్ సీఐలు డానియల్ కుమార్, ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పట్టణ ఎస్సైలు రావుల నాగరాజు,శంకర్,రూరల్ ఎస్సై శివకుమార్,పట్టణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డెలివరీ తర్వాత ఈ న్యాచురల్ స్ప్రే వాడితే హెయిర్ ఫాల్ కు సులభంగా చెక్ పెట్టవచ్చు!