నల్లగొండ జిల్లా:మునుగోడు రాజకీయం తెలంగాణ రాష్ట్ర రాజకీయ కయ్యానికి వేదికగా మారింది.నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం,కాంగ్రేస్ నుండి కాషాయ గూటికి చేరడంతో నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి.
ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో?అసలు జరుగుతుందో లేదో! స్పష్టత లేకున్నా గత నెలన్నర నుండి నియోజకవర్గ రాజకీయాలు మునుగుతూ తేలుతూ ఊగిపోతున్నాయి.
ఈ ఊగుడు స్పీడ్ కు మును"గోడు" రాజ"కీ"యం బాగా వేడెక్కింది.ఇక్కడ ప్రస్తుతం స్థానిక ప్రజా ప్రతినిధులకు,లోకల్ లీడర్లకు భలే గిరాకీ పెరిగింది.
కొద్దిగా తల బయటికెళితే చాలు సరిపడా నోట్ల కట్టలు,క్యార్టర్ కాటన్లు,బీరు కేసులతో చేతినిండా పనితో ఫుల్ జోష్ లో ఉన్న లోకల్ లీడర్లు.
దీనితో ప్రతి రోజూ రాజకీయ వలసల జోరు కొనసాగుతూ గ్రామాలు సైతం కలర్ ఫుల్ గా మారాయి.
తాజాగా మునుగోడులో స్థానిక నేతలు ఉదయం ఏ పార్టీలో మునుగుతారో,సాయంత్రం ఏపార్టీలో తేలుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఎవరు,ఎప్పుడు,ఏ పార్టీలో ఉంటారో తెలియక ప్రధాన లీడర్లు,అభ్యర్థులు సైతం తలలు పట్టుకుంటున్నారు.మునుగోడు మొత్తం ఎన్నికల జాతర జోరు ఉంటే,ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మునుగోడు ఉప ఎన్నిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ బీజేపీ నేతలకు ఈ విషయం చెవిన వేసినట్లు సమాచారం.
బీజేపీకి పూర్తి అనుకూలంగా లేకపోవడం వల్లే ఉప ఎన్నికను ఆలస్యం చేయాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడమే ఖాయమే.
ఆయన ఇప్పటికే ప్రచారంలో జోరుగా తిరుగుతూనే వలసలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.
అమిత్ షా సభ తర్వాత బీజేపీకి వచ్చిన ఊపు ప్రస్తుతం కనిపించడం లేదనే టాక్ తోనే కేంద్రం వెనక్కి తగ్గిందనే ప్రచారం జరుగుతోంది.
ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన పాల్వాయి స్రవంతి రెడ్డి మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ,గడపగడపకు కాంగ్రేస్ పేరుతో ప్రచారంలో బిజీ అయిపోయారు.
టిపీసీసీ ముఖ్య నేతలు నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో క్రమంగా కాంగ్రెస్ బలపడుతుందనే వాదన వినిపిస్తోంది.
టీఆర్ఎస్,బీజేపీలో చేరిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కొందరు తిరిగి సొంత గూటికి చేరుతున్నట్లు కనిపిస్తుంది.
బీజేపీ,కాంగ్రేస్ పార్టీల
జోరు అలా ఉంటే అధికార టీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ గందరగోళ పరిస్థితిలో పడిపోయింది.
జిల్లా
మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం అంతా తానై మునుగోడులో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి అండదండలతో కూసుకుంట్లకే టికెట్ ఖరారైందని గతంలో ప్రచారం కూడా జరిగింది.
మునుగోడు సభలో కేసీఆర్ ఆయన పేరును ప్రకటిస్తారని కూడా వార్తలు వచ్చాయి.కానీ,సభలో కేసీఆర్ అభ్యర్థి పేరు ఎత్తకుండానే ముగించారు.
అయినా అదే ధీమాతో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తనకే టికెట్ వస్తుందని ప్రచారంలో ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా గులాబీ పార్టీలో సీన్ రివర్స్ అవుతున్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్,బీజేపీలు రెడ్డి అభ్యర్థులను బరిలో దింపడంతో సీఎం కేసీఆర్ వ్యూహం మార్చారని అంటున్నారు.
నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉండటంతో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారని
విశ్వసనీయ సమాచారం.
మునుగొడు నియోజకవర్గంలో 67 శాతం మంది బిసి ఓటర్లు ఉన్నారు.ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు మరో 23 శాతం మంది ఉన్నారు.
మునుగోడులో ఓసీ ఓటర్ల శాతం కేవలం 10 లోపే.అంటే మొత్తం రెండు లక్షల 30 వేల ఓటర్లలో ఓసీల సంఖ్య 25 వేల లోపే అన్నమాట.
అందుకే బీసీ అభ్యర్థిని దింపాలని కేసీఆర్ దాదాపు నిర్ణయించారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం.
అయితే మునుగోడు నుంచి బీసీ సామాజిక వర్గాల నేతలైన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్,నారబోయిన రవి ముదిరాజ్,కర్నాటి విద్యాసాగర్ టికెట్ ఆశించారు.
అదే తరుణంలో ఈ బీసీ నేతలు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత జోరుగా జనంలోకి వెళ్లారు.
కానీ,కూసుకుంట్లకు టికెట్ ఖరారైందన్న ప్రచారంతో వారంతా కొన్ని రోజులుగా మునుగోడులో పెద్దగా తిరగడం లేదు.
అయితే తాజాగా కూసుకుంట్ల అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవడతో తిరిగి టిక్కెట్ ఆశలు సజీవంగా ఉండడంతో మళ్లీ జనం బాటపట్టారు.
అందులో భాగంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మునుగోడులో గౌడ్ లకు బీహార్ తాటి విత్తనాలు పంపిణి చేశారు.
అంతటితో ఆగకుండా నియోజకవర్గం మొత్తం పంపిణి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.కేసీఆర్ వ్యూహం ప్రకారం బూర,కర్నె,నారబోయినలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
కానీ,మంగళవారం మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో జరుగిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన సభకు కర్నె,బూర డుమ్మా కొట్టారు.
దీనితో కారు కుటుంబంలో కలతలు వచ్చాయా అని సందేహం కలుగుతోంది.ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు చిన్నా చితక పార్టీలు,సంఘాలు కూడా మునుగోడుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు తెలంగాణలో మునుగోడు హాట్ హాట్ గా మారింది.
టాలెంట్ తో పని లేదు.. వాళ్లకే ఆఫర్లు.. పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు!