మా ఊరిలోనే మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదు:మండలి చైర్మన్ గుత్తా
TeluguStop.com
నల్లగొండ జిల్లా:జిల్లాలో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు చివరి దశలో ఆగిపోయినాయని, వాటికి త్వరగా నిధులను విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందని,అలాగే జిల్లాలోని డిండి,పెండ్లిపాకల, నక్కలగండి,ఉదయసముద్రం,ఎస్ఎల్బీసి పెండింగ్ ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
శనివారం నల్గొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రోడ్లు,భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ ధర్మారెడ్డి, పిలాయిపల్లి కెనాల్స్ పనులు పూర్తైనా చివరి ఆయకట్టు రైతులకు నీరు రాకుండా మోటార్లు,పైపు లైన్స్ ద్వారా అక్రమంగా నీటిని తరలుస్తున్నారని,అధికారులు త్వరగా స్పందించి నీటిని అక్రమంగా తరలించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎస్.డి.
ఎఫ్ నిధులను విడుదల చేసి, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు.అదే విధంగా జిల్లాలోని చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని,మిషన్ భగీరథ ద్వారా అంతటా నీటి సరఫరా అవ్వడంలేదని,తన సొంత గ్రామంలోనే సగం గ్రామానికి మాత్రమే తాగునీటి సరఫరా అవుతుందన్నారు.
గతంలో మనఊరు-మనబడి ప్రోగ్రాంలో పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్నాయని, విద్యాశాఖ అధికారులు వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు.
అనంతరం జెడ్పీటీసీలు, ఎంపీపీలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శాలువాలతో సత్కరించారు.