అమిత్ షా పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు..
TeluguStop.com
నిజామాబాద్: నిన్నటి అమిత్ షా సభతో ప్రజలు ఎవరివైపో తేటతెల్లం అయిందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో "తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో" భాగంగా కవులు, కళాకారులు, స్వాతంత్ర సమరయోధుల సన్మాన కార్యక్రమానికి ఆదివారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సి రాజేశ్వర్ రావు తో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి 75 సంవత్సరం లోకి అడుగపెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ "తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు" జరపాలని నిర్ణయించారని మంత్రి తెలిపారు.
మేమంతా భారతీయులం అని ప్రజలు రాష్ట్రం అంతటా పండుగల సంబురాలు జరుపుకున్నారని,మొదటి రోజు జాతీయ సమైక్యతా ర్యాలీ లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ప్రజలు మవ్వన్నెల జెండా చేతబూని భారత జాతీయ స్ఫూర్తిని చాటారన్నారు.
ఓకే సారి అంతమంది రోడ్ల మీద స్వచ్చందంగా జాతీయ జెండాతో రావడం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
రెండవ రోజు జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకున్నామని,మూడవరోజు స్వాతంత్ర సమరయోధులను,కవులను,కళాకారులను సన్మనించుకున్నమని తెలిపారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రిని విలేఖరులు ప్రశ్నించగా.ఆయన ఘాటుగా స్పందించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు వచ్చారా.? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో అధికారికంగా సంబరాలు జరుగుతుంటే రాజధాని నడిబొడ్డున పోలీసుల కవాతు దేనికి సంకేతమని నిలదీశారు.
రాష్ట్ర మంత్రిగా అమిత్ షాను ప్రశ్నిస్తున్నానని అన్నారు.దేశంలో ఎక్కడైనా ఇట్లా జరిగిందా.
? ఎక్కడ లేనిది తెలంగాణలోనే ఎందుకు పోలీసు కవాతు జరిపారని మండిపడ్డారు.కేంద్ర బీజేపీ నేతలు తెలంగాణ మీద గజిని మహ్మద్ లా దండెత్తి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసిఆర్ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టే తెలంగాణ మీద దండ యాత్రకు వస్తున్నారా అని ప్రశ్నించారు.
ఎందరినో ఎదిరించిన పోరాటాల గడ్డ తెలంగాణ అని, మీ జులుం ను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు.
కేంద్ర బీజేపీ వైఖరి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.వారు వ్యవహరిస్తున్న తీరు భారత ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమన్నారు.
అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని,బీజేపీ కి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.మీ పోలీసు కవాతు సభకు 300 మంది కూడా రాలేదని ఎద్దేవా చేసారు.
ప్రజలు బీజేపీ తీరు పట్ల విసిగిపోయారు.అందుకే వారిని తిరస్కరిస్తున్నారు.
అది గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిదన్నారు.మా సభకు బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది కూడా మీ పోలీసు కవాతు సభలో లేరన్నారు.
కేసిఆర్ నిర్వహించిన గిరిజన సభలో కేవలం గిరిజనులే లక్షల మంది వచ్చారని అన్నారు.
ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని ప్రధాని మోడీ గమనించాలన్నారు.కేంద్ర మంత్రులు వచ్చి రేషన్ షాపుల్లో గొడవలు పెట్టుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ హెడ్ లా ఉండే గవర్నర్ ప్రభుత్వ పాలన సరిగాలేదని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని స్పష్టం అయ్యిందన్నారు.
అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన గిరిజన రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఒక గిరిజన బిడ్డగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము రిజర్వేషన్ అమలుకు అనుకూలంగా ఒత్తిడి తేవాలని కోరారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కేసీఆర్ ను తప్పా తెలంగాణ ప్రజలు ఇతరులను ఎవర్ని నమ్మరని తేల్చి చెప్పారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బిజెపి నేతలు ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని మంత్రి వేముల హెచ్చరించారు.
రాజమౌళి సినిమాలలో ఆ సినిమాకు మాత్రం నష్టాలు వచ్చాయట.. ఏం జరిగిందంటే?