పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలి: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస వసతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో గల 547 పోలింగ్ కేంద్రాలను సెక్టోరియల్ అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి, కనీస వసతులపై నివేదిక సమర్పించడం జరిగిందని, అందులో 198 పోలింగ్ కేంద్రాల్లో కొన్ని వసతులు సక్రమంగా లేవని పేర్కొనడం జరిగిందని తెలిపారు.
198 పోలింగ్ కేంద్రాల్లో 157 పోలింగ్ కేంద్రాల వసతులను మెరుగుపరచడం జరిగిందని అధికారులు జిల్లా ఎన్నికల అధికారికి వివరించారు.
మిగతా 41 పోలింగ్ కేంద్రాల్లో వసతులను సాధ్యమైనంత త్వరగా మెరుగుపరచాలని, సంబంధిత సెక్టోరియల్ అధికారులు మరోసారి అన్ని పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో సందర్శించి, సోమవారం లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
పోలింగ్ రోజు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సదుపాయం, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపు సదుపాయం ఉండేలా చూడాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గౌతం రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, మున్సిపల్ కమీషనర్లు అన్వేష్, మీర్జా ఫసత్ అలీ బేగ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ ఇంటి చిట్కాలతో మలబద్ధకం మటాష్..!