మాతృసేవా కార్యక్రమాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరంగా ఉండేలా ఏర్పాటు చేసిన మాతృసేవా కార్యక్రమాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలని, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వచ్చినప్పుటి నుండి తిరిగి బయటికి వెళ్ళేంతవరకు మాతృసేవా సిబ్బంది వారి వెంటే ఉంటూ వారికి సూచనలు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, మాతృసేవా కార్యక్రమం అమలు తీరును, వెయిటింగ్ ఏరియా, ల్యాబ్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరంగా ఉండేందుకే ప్రత్యేకంగా మాతృసేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులలోనే సంస్థాగత ప్రసవాలు చేయడం, మొదటి కాన్పులో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం వల్ల పేద ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూడాలన్నది ప్రధాన లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్టు ను చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు.
గర్భిణీలు రాగానే వారిని ప్రేమపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని, వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు వారి వెన్నంటే ఉంటూ వారికి కావాల్సిన ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ సేవలను అందించాలని సూచించారు.
ఔట్ పేషెంట్ కౌంటర్ వద్ద పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ టోకెన్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
గర్భిణీ స్త్రీలు వేచి ఉండే ప్రదేశం ఇరుకుగా ఉందని, దీనిని మరింత విస్తరించాలని అన్నారు.
ల్యాబ్ లో శాంపిల్ కలెక్షన్ చేసుకున్న తర్వాత రిపోర్టులు అందించేందుకు ఆక్సిజన్ ప్లాంట్ వైపు తాత్కాలిక షెడ్డు ను ఏర్పాటు చేయాలని సూచించారు.
అన్ని వార్డుల్లో లైటింగ్ ను పెంచాలని, లైటింగ్ తో కూడిన సూచిక బోర్డులను అమర్చాలని ఆదేశించారు.
ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన చికిత్స అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా చూడాలని అన్నారు.
ఈ తనిఖీలో పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, మున్సిపల్ కమీషనర్ ఆయాజ్, తదితరులు ఉన్నారు.
ఈ మలయాళ హీరోతో తెలుగు హీరోలకు ముప్పు తప్పదా..?