బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు…!

సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) కోసం పనిచేసేవాళ్లను గుర్తించకుండా మంత్రిని ఓడించడానికి పనిచేసిన వాళ్లనే గుర్తిస్తున్నారని మాజీ మార్కెట్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా( Peddireddy Raja ) అన్నారు.

బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమారు యాభై మంది నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్( CM KCR ) ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుందని,బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్,కేటీఆర్, కవిత, హరీష్ రావు,అన్నట్లుగా మారిందని,సాధారణ కార్యకర్తల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు.

రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రి మండలి లేకుండా తానే అంతా అన్నట్లు కేసిఆర్ వ్యవహరిస్తున్నారని,ఇక్కడ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని,అది భరించలేక రాజీనామాలు చేశామని,తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ లో చేరి కేసీఆర్,జగదీష్ రెడ్డి అహంకారానికి చమరగీతం పాడుతామనిహెచ్చరించారు.

ధరణిలో ప్రజల 16 లక్షల పెండింగ్ భూములు ఉన్నాయని ధరణి వచ్చిన తర్వాత ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారన్నారని, బ్రతుకు తెరువు కోసం భూములు వదిలిపెట్టి పోయిన రైతులభూములను వాళ్లకు తెలియకుండానే మార్పిడి చేశారని,ప్రభుత్వ భూములను కాపాడాలసింది పోయి వాళ్లే బకారుసురుల్లాగా మారిపోయారని ఆరోపించారు.

టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఎమ్మెల్యే అయితే రూ.1000 కోట్ల సంపాదన,మంత్రి అయితే పదివేల కోట్ల సంపాదనగా దోచుకోవడం,దాచుకోవడంలక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన నేత అని కేసీఆర్ ను నమ్మి,ఉద్యమ నాయకుడని మంత్రిని గౌరవించి ఆయన సమక్షంలో కండువా కప్పుకున్నామని,నాలుగేళ్లు అయినా గౌరవం లేదని వాపోయారు.

మునుగోడు,హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మా సహకారం తీసుకోలేదని,పది నెలల్లో ఏ ఒక్కరోజు కూడా క్యాంప్ ఆఫీస్ కు వెళ్లకుంటే ఎందుకు రావడం లేదని మందలించిన దాఖలాలు లేవన్నారు.

ఇక్కడ ఉన్న 50 మంది నాయకుల్లో ప్రతి ఒక్కరూ టిఆర్ఎస్ కు సేవ చేసిన వాళ్ళేనని,సేవ చేసిన వాళ్ళని గుర్తించకపోవడం,మంత్రి జగదీష్ రెడ్డి ఓడిపోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేసిన వారు పదవులు అనుభవిస్తున్నారని, వారిని వెంటేసుని మంత్రి తిరుగుతున్నారని వారందరూ కూడా త్వరలోనే ఆయనకు తగిన గుణపాఠం చెప్తారని జోస్యం చెప్పారు.

ఎన్టీఆర్ కాలంలో నేషనల్ ఫ్రంట్ పెడితే రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వం పోయిందని, అదే విధంగా గొప్పలకు పోయి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

పార్టీకి రాజీనామా చేసి స్వేచ్ఛ జీవులం అయ్యామని,మంత్రి ఒంటెద్దు పోకడను ఇప్పటికైనా మార్చుకోవాలని లేకపోతే తగిన గుణపాఠం తప్పదన్నారు.

సూర్యాపేటలో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న మంత్రి 100 పడకల హాస్పిటల్,ఇంజనీరింగ్ కళాశాల,ఆర్టీసీ బస్ స్టేషన్,ఆర్డీవో కార్యాలయం,మార్కెట్, మంత్రి కార్యాలయం ఇంటిగ్రేటెడ్ కార్యాలయం ఇవన్నీ ఎవరు తెచ్చారో తెలుసుకోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఎవరికి టికెట్ వచ్చిన పూర్తి సహకారం అందిస్తామని, టెక్నిక్ విషయాల ద్వారానే టిఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరికల సమయంలో ఇంకా అనేక వలసలు ఉంటాయని,200 వందల వాహనాల ద్వారా చేరికలు జరుగుతాయని అందర్నీ సమన్వయంతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే మా లక్ష్యం అన్నారు.

ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, బాషిపంగు బాస్కర్, శనగాని రాంబాబు,నేరెళ్ల మధు,మోదుగు నాగిరెడ్డి, దున్న బాబు,రాచకొండ దేవయ్య,సాజిద్, పలువురు ఉద్యమకారులు, మల్లారెడ్డి,కొమరయ్య, రాచకొండ దేవయ్య, ఎలుగూరి వెంకన్న,ఉప్పల మధు,కారింగుల వేణు, కొండ రాజేష్,సలిగంటి శ్రీనివాస్,కళ్యాణ్,పోరేటి సత్యనారాయణ,పర్వతం ఉపేంద్ర చారి,దస్రు, సురేష్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్ ఇదే.. మాట్లాడాల్సింది ఏమీ లేదంటూ?