మనువాదం యమ డేంజర్:మంత్రి

సూర్యాపేట జిల్లా:మనువాదం కారణంగానే దేశం పరాయి పాలనలోకి పోయిందని,భారతదేశం పురాతన కాలంలో విద్యాపరంగా ముందంజలో ఉందని,ఇక్కడ అనేక విశ్వవిద్యాలయాలు పురాతన కాలంలోనే వున్నాయని,కానీ,తరువాత కాలంలో మనువాదం వ్యాప్తి చెందడం వలన దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడి,విద్యా వ్యవస్థను సామాన్య ప్రజలకు దూరం చేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నవతెలంగాణ బుక్ స్టాల్ ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంపై చిన్నచిన్న దేశాలు దాడులు చేయడానికి, దేశాన్ని ఆక్రమించి,ముక్కలు చేయడానికి మనువాదమే కారణమని వ్యాఖ్యానించారు.

కానీ, స్వాతంత్ర్యం అనంతరం తిరిగి మతోన్మాదశక్తులు బలం పుంజుకున్నాయని,మతోన్మాదశక్తులపై పోరాటంలో ప్రగతిశీల శక్తులు వెనకబడ్డాయన్నారు.

సినిమాలు,టివిలతో ప్రభావితమైన యువత సమాజానికి దూరంగా వుండిపోయిందని,దేశద్రోహ శక్తులు మళ్ళీ వర్ణ వ్యవస్థను తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాయని పునరుద్ఘాటించారు.

ప్రజలను జాగరుకం చేయవలసిన భాధ్యత ప్రగతిశీల శక్తులపై వుందని,మంచి పుస్తకం ఒక మనిషి జీవితాన్ని మారుస్తుందని,ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలని సూచించారు.

అనంతరం సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ,ఆర్ఎస్ఎస్ ల పాత్ర లేదన్నారు.

కానీ,బీజేపీ నేతలు తెలంగాణ సాయుధ పోరాటాన్ని మతపరమైన పోరాటంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ,చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ సమాజంలో మతపరమైన విభజన తీసుకుని రావడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,ఎంపిపి నెమ్మాది భిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.

వెంకటేశ్వర్లు,ఉప్పల ఆనంద్, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిఐటియు నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు,సిపిఎం జిల్లా నాయకులు యాదగిరిరావు,కోట గోపి,బొమ్మిడి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

వీడియో: పూజ చేస్తుండగా దూసుకు వచ్చిన పాము.. భక్తురాలు ఏం చేసిందంటే..