మంటల్లో కాలిపోయిన మామిడి చెట్లు

నల్లగొండ జిల్లా: నాలుగేళ్ళుగా కాపాడుకున్న మామిడి చెట్లు ఒక్కసారిగా మంటల్లో కాలిపోవడంతో రైతు తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి పెద్ద అడిశర్లపల్లి మండలం పోల్కపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

గ్రామానికి చెందిన ఏలేటి నరసింహ దాదాపు 10 ఏళ్లుగా మామిడి తోట సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

వ్యవసాయం తప్ప మరో బతుకుదెరువు లేని అతను మామిడి చెట్లను కాపాడుకుంటూ వస్తున్నాడు.

సోమవారం సాయంత్రం తోటకు నీళ్లు కట్టడానికి వెళ్లగా సుమారు ఎకరం 30 గుంటల్లో ఉన్న మామిడి చెట్లు కాలిపోయి కనిపించాయి.

కింద బీడు భూముల్లో అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించి తోటకు అంటుకున్నట్లు తెలుస్తుంది.

ఇంకా రెండు మూడు రోజులు అయితే మామిడిపళ్ళు కోసుకునే వాడినని, అమ్మడానికి బేరం కూడా వచ్చిందని,ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని వాపోయాడు.

నేను పెట్టిన పెట్టుబడి ఏ విధంగా వస్తుందని,ఆరుగాలం కష్టపడి పండించిన చెట్లు పోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు.

రైతు ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.అగ్ని ప్రమాదంలో సుమారు 3 లక్షల విలువైన పంట నష్టం జరిగిందని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయాలని కోరుతున్నాడు.

వైరల్ వీడియో: ఇంకా మారారా.. ట్రైన్ ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చిన మహిళ.. చివరకి..