పంజాబ్ : చదువుకున్న కాలేజీని సందర్శించిన భారత సంతతి బ్రిటీష్ ఎంపీ.. విద్యార్ధులకు సూచనలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దేశం కానీ దేశంలో స్థిరపడినా మాతృభూమిపై మమకారాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు ప్రవాస భారతీయులు.

అక్కడ తాము సంపాదించే ప్రతి రూపాయిలో కొంత భాగాన్ని జన్మభూమి కోసం ఖర్చుపెట్టేవారు ఎంతో మంది వున్నారు.

అంతేకాకుండా గ్రామాలను దత్తత తీసుకోవడం, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, రోడ్లు, మంచినీటి వసతి కల్పించడం వంటి పనులను ఎన్ఆర్ఐలు నిర్వర్తిస్తున్నారు.

ఎంత బిజీగా వున్నప్పటికీ వీలు కుదిరినప్పుడల్లా భారతదేశానికి వస్తూ పోతూ వుంటారు.తాజాగా బ్రిటన్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయుడు , హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడైన లార్డ్ రాజీందర్ పాల్ లూంబా బుధవారం తన సొంత రాష్ట్రం పంజాబ్‌లో పర్యటించారు.

జలంధర్ నగరంలో తాను చదువుకున్న డీఏవీ కాలేజీని సందర్శించారు.లార్డ్ లూంబాకు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

కళాశాలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు గౌరవ వందనం సమర్పించారు.కళాశాలలో నూతనంగా నిర్మించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్‌‌ను రాజీందర్ ప్రారంభించారు.

"""/" / అనంతరం విద్యార్ధులనుద్దేశించి ప్రసంగిస్తూ.తల్లిదండ్రుల పట్ల గౌరవభావంతో వుండాలని సూచించారు.

అలాగే జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి లూంబా విద్యార్ధులకు వివరించారు.37 ఏళ్లకే వితంతువుగా మారిన తన తల్లి దివంగత పుష్పావతి లూంబాను గుర్తుచేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లోని 500 మంది వితంతువులకు సహాయం చేసేందుకు గాను తన ఫౌండేషన్ కార్యక్రమాలను నిర్వహించనుందని లూంబా తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో దీనిని ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.లూంబాకు ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్స్ కోఫీ అన్నన్, బాన్ కీ మూన్ వంటి ప్రపంచస్థాయి నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి.

25 ఏళ్ల క్రితం తన తల్లి జ్ఞాపకార్థం లుంబా ఫౌండేషన్ ను స్థాపించారు లార్డ్ రాజ్ లుంబా.

అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో బలమైన లాబీయింగ్ చేసి జూన్ 23ని అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించేలా చేశారు.

దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. కడియంకు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్