లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణమాఫీ పూర్తి::రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని, నేడు లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారుమంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీ నుంచి శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు , రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

రైతు రుణమాఫీ పై రూపొందించిన ప్రచార పాట, ప్రచార చిత్రాలను ను సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు తిలకించారు.

రైతు రుణమాఫీ సందర్భంగా రాష్ట్రంలోని పలు రైతుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్ బ్యాక్ స్వీకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ అనే నిరూపించేందుకు రైతు రుణమాఫీ కార్యక్రమంలో మలి విడత కింద 1,50,000 వరకు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ నిధులను ఈ రోజు విడుదల చేస్తున్నామని అన్నారు.

నేడు దేశంలో బడా బడా వ్యాపార వేత్తలు వ్యాపారాలలో నష్టాలు చూపిస్తూ , తప్పుడు లెక్కలు చూపించి బ్యాంకులకు తీసుకున్న కోట్ల రూపాయలు ఎగవేసి దేశాన్ని విడిచి పారిపోతున్నారని అన్నారు .

గత 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ వ్యాపార సంస్థలు మోసగించాలనే ఉద్దేశంతో దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేయడం జరిగిందని, కానీ రైతు దేశంలో ఏ మూలన ఉన్న 10 మందికి ప్రయోజనం చేకూరాలని పంట రుణాలు తీసుకొని వచ్చి పంటలు పండిస్తే, ఆశించిన మేర ఉత్పత్తి కాకపోవడం గిట్టుబాటు ధర దొరకపోవడం వంటి కారణాల వల్ల బ్యాంకు రుణాలు చెల్లించకుండా ఉన్నారని తెలిపారు.

రైతుల కష్టాలను చూసి వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంతో ఉండాలని, ఆర్థిక సంక్షేభంలో కురుకోవద్దని ఉద్దేశంతో వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించామని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నేడు రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని అన్నారు.

ఆర్థిక సంక్షేభంలో రాష్ట్రం ఉన్నప్పటికీ రైతులకు 31 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నామని , మొదట లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న దాదాపు 11 లక్షల 30 వేల మంది రైతులకు 6098 కోట్ల రుణమాఫీ నిధులను జూలై 18న విడుదల చేశామని, నేడు రెండవ విడత క్రింద లక్షన్నర వరకు రుణాలు ఉన్న 6 లక్షల 40 వేల మంది రైతులకు 6190 కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేస్తున్నామని సీఎం తెలిపారు.

పండిట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి దేశ భద్రత ,ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యత దేశంలో కల్పించామని అన్నారు.

బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలుపెట్టి నాగార్జునసాగర్ వరకు జోహార్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా నిర్మించారని సీఎం తెలిపారు.

పేద రైతులకు అప్పు పుట్టాలని ఉద్దేశంతో ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీకరణ చేసి రైతులకు తక్కువ వడ్డీకి అప్పు అందించారని తెలిపారు.

అనంతరం సోనియాగాంధీ మన్మోహన్ సింగ్ దేశంలో ఆహార భద్రత తీసుకుని వచ్చి పేదల ఆకలి తీర్చారని అదేవిధంగా దేశవ్యాప్తంగా 72 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారని అన్నారు.

దేశంలో ఆహార భద్రత చట్టం ,విత్తన సబ్సిడీ ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, పంటల బీమా, రైతుల పండించిన పంటలకు కనీసం మద్దతు ధర కల్పించింది ప్రభుత్వమని సీఎం పేర్కొన్నారు.

ఆగస్టు నెలలో రెండు లక్షల వరకు రైతుల రుణమాఫీ పూర్తి చేసి రైతులకు రుణ విముక్తి కల్పిస్తామని, దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు రైతులకు కూడా ఆగస్టు మాసంలో రుణాలు నుంచి స్వేచ్ఛ వస్తుందని అన్నారు.

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ దేశంలో ఏ ఇతర రాష్ట్రం చేయలేదని , తెలంగాణ మాత్రమే భారీ ఎత్తున రైతులకు రుణాలు మాఫీ చేస్తుందని సీఎం పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోయినా రైతుల సంక్షేమాన్ని మాత్రమే ఆకాంక్షించి తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేపడుతుందని అన్నారు.

కార్పొరేట్ సంస్థల మొండి బొక్కలు చ…బొక్కలు చెల్లించేందుకు బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ అవకాశం కల్పిస్తుందని, కానీ తమ ప్రభుత్వం రైతులకు సంబంధించిన రుణాలు ఫుల్ టైం సెటిల్మెంట్ ఒకేసారి చేస్తున్నామని సీఎం అన్నారు.

రెండవ విడత రైతు రుణమాఫీ నిధుల( Rythu Runa Mafi ) విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత కింద లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న 23 వేల 785 మంది రైతుల ఖాతాల్లో 167 కోట్ల నలభై ఎనిమిది లక్షలు ప్రభుత్వం గతంలో జమ చేసిందని అన్నారు.

నేడు లక్షన్నర వరకు ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తుందని, మన సిరిసిల్ల జిల్లాలో రెండో విడత 11 వేల 915 మంది రైతులకు సంబంధించి 116 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని కలెక్టర్ తెలిపారు.

రెండవ విడతలో రైతు రుణమాఫీ జరిగిన లబ్ధిదారుల బ్యాంకు రుణాలను రెన్యువల్ చేసుకుని రుణమాఫీ సొమ్మును వారి సేవింగ్స్ ఖాతాలలో జమ చేయాలని, దీనికోసం బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ ఎల్డీఎం మల్లికార్జున్ వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు రైతులు ప్రజా ప్రతినిధులు వ్యవసాయ విస్తరణ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం, మృతుల్లో అన్నదమ్ములు