అన్నీ ఉన్నవారికే రుణమాఫీలా…గోల్డ్ లోన్ బాధితుల గోస ఎవరికీ పట్టదా…?

నల్లగొండ జిల్లా: ప్రభుత్వాల పార్టీలు ఏవైనా,పాలకులు ఎవరైనా ప్రజా సంక్షేమమే తమ ధ్యేయం అంటూ ఉచితాల సంక్షేమ జాబితా తయారీ చేస్తారు.

అవి పేరుకు పేదలకోసం చేసినట్లుగా అనిపిస్తాయి.కానీ,వాస్తవంగా అవన్నీ పెద్దల కోసం పెద్దలు చేసుకునే చీకటి రాజకీయాలు అనే విషయం పాపం ఓటేసే పేదలకు తెలియకపోవడం విచారకరం.

ప్రభుత్వాలు ఏవైనా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు మొత్తం అవినీతి పాప పంకిలమై ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.

అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పెట్టుబడిదారులకు, రైతులకు రుణమాఫీ వ్యవహారం.బడా పారిశ్రామిక వేత్తలకు కోట్ల రూపాయలు,బడా భూస్వాములకు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే ప్రభుత్వాలపై ఎలాంటి ఆర్ధిక భారం పడదేమో.

?కానీ,అస్సలు ఎలాంటి ఆధారం లేని నిరుపేద కుటుంబాలు కాయకష్టం చేసి,తిని తినక పస్తులతో కూడబెట్టి తులమో పలమో పెళ్ళాం, పిల్లల కోసం బంగారం కొనుక్కొని, కుటుంబంలో ఏదైనా పెద్దకష్టం వచ్చినప్పుడు ఒంటిపై ఉన్న కొద్దిపాటి బంగారం బ్యాంక్ లో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని,ఆ అప్పులు తీర్చే మార్గం లేక తనఖా పెట్టిన బంగారంపై ఆశలు వదులుకున్న కుటుంబాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.

అయినా పాలకులకు వారి గోస కనిపించదు.వ్యాపారాలు లేక,భూములు లేక, ఉద్యోగం లేక,ఉపాధి లేక బ్రతుకే భారంగా మారి దగా పడుతున్న జీవితాలపై ఎవరికీ కనికరం అనేదే ఉండదు.

ఎందుకంటే వారు ప్రభుత్వాలకు కేవలం ఓట్లు వేసే యంత్రాలు మాత్రమే కాబట్టి.ఓట్ల సమయంలో ఒక క్యార్టర్,బీరు,బిర్యాని, రూ.

500 నోటు ఇస్తే ఓటు వేస్తారులే అనే నమ్మకం.ఆ నమ్మకంతోనే ఏళ్ల తరబడి ఆ వర్గాల ప్రజలను కేవలం పావులుగా వాడుకుంటూ అవసరం తీరాక పక్కన పడేస్తున్న పరిస్థితి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా ఏమీ చేయలేక నిస్సయస్థితిలో దిక్కుతోచక పేదరికంలో మగ్గిపోతూనే ఉన్నారు.

రోజురోజుకు శ్రీమంతులు అపర కుబేరులుగా మారుతుంటే,పేదలు మరింత నిరుపేదలుగా మారి కృంగిపోతున్నారు.గోల్డ్ లోన్ బాధితులకు భరోసా ఇచ్చే వారేరి? అని బాధితులు ఏళ్ల తరబడి మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

రైతులకు రుణమాఫీ చేయడం మంచిదే.కానీ,ఏ రైతుకు చేస్తే వారికి చేయూత అవుతుందని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా? వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రైతు రుణమాఫీ చేయకపోతే అతని సంపద తరిగిపోతుందా? సన్న చిన్నకారు రైతులకు రుణమాఫీ చేయడంలో అర్దం ఉంది.

మరి గుంట కాదు సెంటు భూమిలేని అభాగ్యుల సంగతి ఏమిటి? వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక, కుటుంబాలు గడవక,పెద్ద రోగమొస్తే దవాఖానాలో చూపించుకోలేక,పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక రెక్కల కష్టంతో కొనుకున్న కొంత బంగారం బ్యాంక్ లో పెడితే వాళ్ళు పాలకులకు సంపన్నులుగా కనిపిస్తున్నారా? అందరి లోన్లు మాఫీ చేసే ప్రభుత్వాలు నిరుపేదల గోల్డ్ లోన్ విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారు?ఇంతకీ వాళ్ళు చేసిన పాపమేంటీ?అనే ప్రశ్నలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ఎలాంటి ఆధారం లేని గోల్డ్ లోన్ బాధితులను కూడా అక్కున చేర్చుకుని,వారికి కూడా ఎలాంటి షరతులు లేకుండా రూ.

2 లక్షల వరకు గోల్డ్ లోన్ రుణమాఫీ చేయాలని కోరుతున్నారు.ప్రజా పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం గోల్డ్ లోన్ బాధితుల పక్షాన ఆలోచన చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి.

!!.

దేవర హిందీ ప్రమోషన్ల కోసం టాప్ స్టార్లు.. యంగ్ టైగర్ ప్లాన్ వేరే లెవెల్ లో ఉండనుందా?