అందరి లెక్కలు తేలుస్తాం:డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నల్లగొండ జిల్లా:మునుగోడులో జరగనున్న ఎన్నికల్లో అన్ని పార్టీల లెక్కలు తేలుస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు.

ఇంతకాలం అక్రమంగా దోపిడీ చేసి దాచుకున్న సంపద అంతా బయటకు తీస్తామన్నారు.డబ్బు,మద్యం,బంగారం పంచినా ప్రజలు బిఎస్పినే గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్ని పార్టీలు డబ్బు,మద్యమే బలంగా భావిస్తే,బిఎస్పి మాత్రం జనమే మా బలం అని తెలిపారు.

మేం జనాన్ని నమ్ముకున్నామన్నారు,నిరంతరం జనాల్లో ఉండే పార్టీ మాది అని తెలిపారు.కెసిఆర్ గడీలలో ఉండి మద్యం డబ్బు పంచుతూ నీచ రాజకీయాలు చేస్తూ అడ్డదారిలో గెలవాలని చూస్తున్నారని తెలిపారు.

కానీ,ఈసారి ప్రజలు దొరలను మోసం చేసి బహుజన బిడ్డకు పట్టం కట్టనున్నారని పేర్కొన్నారు.

మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి మండలంలోని రాందాస్ తండ,జాన్ తండ,దొరోనిగడ్డతండ ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

గత 67 సంవత్సరాల కాలంలో 67 శాతం జనాభా ఉన్న బిసిలను మోసం చేసిన ఆధిపత్య దొరల మెడలు వంచడానికే బిఎస్పి ఒక బిసి బిడ్డకు టికెట్ ఇచ్చామన్నారు.

ఇంతకాలం పాలించిన నాయకులు కనీసం ఇళ్ళు కూడా కట్టించలేకపోయారని ఎద్దేవా చేశారు.బిఎస్పి అంటే పని చేసే పార్టీ,ప్రేమించే పార్టీ,ప్రజలను కాపాడే పార్టీ అని తెలిపారు.

టిఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్ లు కొనే పార్టీలు,అమ్ముడుపోయే పార్టీలు,దోపిడి పార్టీలు,కమీషన్ల పార్టీలని విమర్శించారు.ఈ పార్టీలు మునుగోడులో ఇప్పటికే 170 కోట్ల మద్యం,70 కోట్ల మాంసం పంపిణీ చేశాయన్నారు.

మా అభ్యర్థి గెలిచిన వెంటనే ప్రభుత్వాన్ని గల్లపట్టి నిలదీసి పనులు చేయించుకుంటామని, లేదంటే గద్దె దింపుతామని వెల్లడించారు.

తండాల ప్రజలు రోడ్డు,బస్సు,బ్రిడ్జి సౌకర్యాలు లేక తల్లడిల్లుతుంటే పట్టించుకోవడం లేదన్నారు.బిఎస్పి పాలనలో గిరిజనులకు పోడు పట్టాలు, రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన కల్పిస్పామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,పూదరి నర్సింహ, నాగేంద్రబాబు,మండల నాయకులు సుజాత,పృధ్వీ,సురేష్, రమావత్ రమేష్ నాయక్,రవి తదితరులు పాల్గొన్నారు.

రూ.20 వేలతో కొన్న బైక్‌కు రూ.60 వేలతో బరాత్‌.. చివరకు షాకిచ్చిన పోలీసులు..