మా ఊరి మట్టి రోడ్డు చూడతరమా!

నల్లగొండ జిల్లా:స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు ఆ గ్రామానికి మట్టి రోడ్డు కూడా సక్రమంగా లేక గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పేర్లతో జాతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న వేళ తమ గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం లేదని,అది చాలదన్నట్లు ఇదే రోడ్డుపై కంకర టిప్పర్ల రాకపోకలతో మరింత అద్వాన్నంగా తయారైందని ఆరోపిస్తూ ఆదివారం గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగిన ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం బోల్లేపల్లి గ్రామంలో జరిగింది.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాలకు తారురోడ్లు, సీసీరోడ్లు ఉంటే తమ గ్రామానికి మాత్రం మట్టిరోడ్డుకు కూడా దిక్కులేదని,మమ్మల్ని చూసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు,చుట్టాలు నవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రోడ్డుపై కంకర మిల్లుకు చెందిన టిప్పర్లు ఇష్టారాజ్యంగా తిరగడం వల్ల గుంతలు ఏర్పడి వర్షా కాలంలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని,ఇందులో జారిపడి అనేకమంది గాయాలపాలయ్యారని అన్నారు.

గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కనీసం గ్రామానికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

దీనితో గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని,ప్రజా ప్రతినిధులు,అధికారులు తమ గోడు పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు.

గతంలోమట్టి రోడ్డు కూడా బాగానే ఉండేదని,ఇక్కడ కంకర మిల్లు వల్ల టిప్పర్ లు ప్రతిరోజు తిరగడంతో రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.

ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులు స్పందించి కంకర టిప్పర్లను నిలిపివేయాలని,తక్షణమే గ్రామానికి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఒకేసారి ఆలయానికి, గురుద్వారాకి .. వైవిధ్యం చాటుకున్న ఆస్ట్రేలియా ప్రధాని